రైతు రుణమాఫీ సంపూర్ణం

-మాట నిలబెట్టుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం -బ్యాంకుల నిర్లక్ష్యంతో నిలిచినవాళ్లకూ లబ్ధి -24,633 మందికి ప్రయోజనం.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా గతంలో రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలుపరిచింది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన 24,633 మంది రైతులకు రూ.160,29,18,077 రుణాలు మాఫీ అవుతాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర శాసనసభ రద్దుకు ముందే వ్యవసాయశాఖ సంబంధిత ఫైలును సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపింది. సీఎం సంతకం తర్వాత ఉత్తర్వులు వెలువడటంలో కొంత జాప్యం జరిగింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయల్లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీచేసిన సంగతి తెలిసిందే. సుమారు 35.33 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం బ్యాంకులకు రూ.16,124 కోట్లు చెల్లించింది. ఆ సమయంలో బ్యాంకులు రుణమాఫీ అర్హులను గుర్తించే క్రమంలో కొందరు రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపకపోవడంతో అర్హులైన సుమారు 25 వేలమంది రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోయారు. దీంతో వారికి కూడా రుణమాఫీని వర్తింపజేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పట్లోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అసెంబ్లీలోనూ పలుమార్లు చర్చ జరుగడంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వ్యవసాయ కమిషనర్ 2017లో ప్రభుత్వానికి అందజేశారు. ఫలితంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తించింది.