నవీన్‌ను ఆశీర్వదించండి!

నవీన్ విజయ్‌కృష్ణ, నిత్య, శ్రావ్య నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం నందిని నర్సింగ్ హోమ్. పి.వి.గిరి దర్శకుడు. రాధా కిషోర్.జి, భిక్షమయ్య సంగం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు విడుదలవుతున్న ఈ చిత్ర ప్లాటినమ్ డిస్క్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కృష్ణ, దాసరి నారాయణరావు, మోహన్‌బాబు చిత్ర యూనిట్ సభ్యులకు ప్లాటినమ్ డిస్క్ జ్ఞాపికల్ని అందజేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ మా కుటుంబం నుంచి మొదటి తరంలో నేను, విజయనిర్మల సినిమాల్లో నటిస్తే, రెండో తరంలో నరేష్, రమేష్, మహేష్, సుధీర్‌బాబు నటులుగా గుర్తింపును పొందారు. ఇప్పుడు మూడవ తరంలో నవీన్ హీరోగా పరిచయమవుతున్నాడు. అతను నటించిన నందిని నర్సింగ్ హోమ్ బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ అవుతుంది. ఆడియో విడుదలైన వారం పది రోజులకు ప్లాటినమ్ డిస్క్ వేడుకను జరుపుకోవడం ఆనందంగా వుంది. ప్రేక్షకులు, అభిమానులు నవీన్‌ను ఆశీర్వదించి చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలి అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ కృష్ణ గొప్ప సంస్కారవంతుడు. వారితో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. వీరి కుటుంబానికి చెందిన నరేష్ తనయుడు నవీన్ నాకు బిడ్డలాంటి వాడు. మంచి టెక్నీషియన్. అతను నటించిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి నవీన్‌ని టాప్ హీరోగా నిలబెట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల, నవీన్ విజయ్‌కృష్ణ, నిత్య, శ్రావ్య, పి.వి.గిరి, రాధాకిషోర్, భిక్షమయ్య సంగం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.