డీమార్ట్, ఎస్‌బీఐ పేరిట ఫేక్ ప్రకటనలు...

హైదరాబాద్ : హ్యాకర్లు ఫ్రీ వోచర్, పాయింట్లు అంటూ మీ సమాచారాన్ని తెలుసుకునేందుకు సరికొత్త స్కెచ్ వేస్తున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారు. దీని కోసం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించుకొని వాటిపై పేరొందిన సంస్థల పేరు మీద వైరస్‌లతో కూడిన ప్రకటనలను రూపొందిస్తున్నారు. ఆ ప్రకటనను చూడగానే వినియోగదారుడిని ఆకర్షించేందుకు ప్రకటనలకు ఫ్రీగా నగదు పొందే మార్గాన్ని జోడిస్తున్నారు. దీంతో చాలా మంది ఆ ప్రకటనలను చూడగానే మరో ఆలోచన చేయకుండా వాటిని క్లిక్ చేసి హ్యాకర్ల వైరస్‌ను ఆహ్వానిస్తున్నారు. తాజాగా డీమార్ట్, ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్ల పేరిట హ్యాకర్లు మాల్‌వేర్స్‌ను పంపిస్తూ స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులను దోచుకునేందుకు పథకం వేశారని ఐటీ నిపుణులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చూడగానే షేర్ చేయకుండా వాటిని పరిశీలించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

డీమార్ట్ వోచర్ అంటూ..

డీమార్ట్ మీకు ఉచితంగా రూ.2500 షాపింగ్ వోచర్‌ను ఇస్తుంది...వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను అందజేస్తుంది. మీరు ఈ ఆఫర్‌ను పొందాలంటే http://www.dmartindia.com/voucher క్లిక్ చేయండని లింకులతో ఆకట్టుకుంటున్నారు. ప్రకటనలో డీమార్ట్ వోచర్ లింక్‌ను క్లిక్ చేయగానే మీకు ఓ పేజీ వస్తుంది. అందులో కేవలం ఇంకా 80 వోచర్లు మిగిలి ఉన్నాయి మా ప్రశ్నలకు మీరు ఎస్ లేదా నో లేదా తెలియదని క్లిక్ చేస్తే సరిపోతుందని అనే సమాచారం ఉంటుంది. ఆ ప్రశ్నలకు బదులు ఇవ్వగానే మీకు మరో పేజీ వస్తుంది. అందులో మీరు డీమార్ట్ వోచర్ రూ.2500కు ఎంపికయ్యారని కనిపిస్తుంది. ఈ షాపింగ్ వోచర్‌ను పోందాలంటే ఈ ప్రకటనను మరో 20 మందికి వాట్సాప్ ద్వారా ప్రచారం చేయాలని సూచిస్తారు. ఆ తర్వాత క్లెయిమ్ వోచర్‌ను క్లిక్ చేసి అందులో చిరునామా ఇతర వివరాలను వెల్లడిస్తే మీకు ఒకటి నుంచి 2 రోజుల్లో మీకు మెయిల్ ద్వారా వస్తుందని స్పష్టం చేసి ఉంటుంది.

ఎస్‌బీఐ క్రెడిట్ పాయింట్ల పేరిట..

డియర్ కస్టమర్ యువర్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ వర్త్ రూస్ 6897 ఎక్స్‌ఫైర్డ్ 03/06/2018. కైన్‌డ్లీ కన్‌వర్ట్ యువర్ పాయింట్ ఇన్ క్యాష్ బై క్లికింగ్ హియర్ http://visapointzone.com/ అంటూ ఈ మధ్య ప్రకటనలు ఫోన్‌లకు వస్తున్నాయి. ఇది చూసిన ఆండ్రాయిడ్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు వేలాది రూపాయలు వెనక్కి పోతాయనే ఆందోళనలో లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. దీంతో హ్యాకర్ వైరస్‌లు ఫోన్‌లోకి దూసుకువస్తున్నాయి. ఇది గమనించకుండా, ఏమి ఆలోచించకుండా లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత వస్తున్న మరో పేజీల్లో వ్యక్తిగత వివరాలతో పాటు క్రెడిట్ కార్డు సీవీవీ నంబరు, ఏటీఎం పిన్ నంబరు, రిజిస్టర్ మొబైల్ నంబరు, ఆధార్ నంబరులు అడుగుతున్నారు. డబ్బు పోందాలనే ధ్యాసలో చాలా మంది ఫోన్ వినియోగదారులు వాటిని వెల్లడిస్తూ తమ సమాచారాన్ని మొత్తం హ్యాకర్‌ల చేతిలో పెడుతున్నారు.

నియంత్రించడం ఎలా...

స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు మొదట వారి ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి సేఫ్టీ-ప్రైవసీ ఆప్షన్‌కు వెళ్లి అక్కడ అన్‌నౌన్ సోర్సస్ బటన్‌ను ఎప్పుడు ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇలాంటి మాల్ వేర్స్‌తో కూడిన ప్రకటనలు వచ్చినప్పుడు అవి అటోమెటిక్‌గా ఫోన్ సిస్టమ్‌లోకి ప్రవేశించకుండా ఉంటాయి. లేదంటే మీకు తెలియకుండానే ఇలాంటి ప్రకటన రాగానే మాల్‌వేర్స్ ఫోన్‌లోకి ప్రవేశించి మీ ఫోన్‌లో ఉన్న ప్రతి అంశాన్ని హ్యాకర్ చూసుకునేలా చేస్తుంది.

https:// ఉంటేనే క్లిక్ చేయాలి..

మీరు గమనిస్తే హ్యాకర్‌లు పంపించే యూఆర్‌ఎల్(యూనిఫాం రిసోర్స్ లొకేటర్)లో కేవలం http:// మాత్రమే ఉంటుంది. డీమార్ట్ http://www. dmartindia. com/voucher ,ఎస్‌బీఐ http:// visapointzone. com/ ప్రకటనలో http మాత్రమే ఉంది. అంటే ఇది పక్కగా హ్యాకర్ పంపించిందని గుర్తించుకోవాలి. అదే అసలు యూఆర్‌ఎల్ నుంచి వస్తే కచ్చితంగా https:// అని ఉంటుంది. అది సురక్షితమైంది. కాబట్టి ప్రకటనలు వచ్చినప్పుడు వాటి లింక్‌లలో https ఉందా లేదా అనే విషయాన్ని గమనించి అవి ఉంటేనే క్లిక్ చేయాలి లేదంటే వాటిని డిలీట్ చేయాలి.

హ్యాకర్ల బ్లాక్‌మెయిల్ ఇలా...

మాల్‌వేర్స్‌తో కూడిన ప్రకటనలు పంపించిన తర్వాత హ్యాకర్లు మీ ఫోన్‌లోని ప్రతి అంశాన్ని గమనిస్తారు. అందులో భద్రపర్చుకున్న ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత విషయాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన అంశాలను తెలుసుకుంటారు. వాటిని ఆధారంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. లేదంటే వాటిని సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులకు దిగుతారు. రిజిస్టర్ ఫోన్ నంబరును తెలుసుకొని బ్యాంక్‌లకు ఫోన్ చేసి నంబరును మార్పించుకొని మీ బ్యాంక్, క్రెడిట్, డెబిట్ కార్డుల వ్యవహారాలను వారు జరిపి మిమ్మలను ఆర్థికంగా ముంచేస్తారు.
× RELATED లక్షల్లో బాలాపూర్ లడ్డూ. ఎందుకంత ప్రత్యేకతంటే?