ఫేస్‌బుక్ నిజాలు దాచిందట.. అబద్ధాలు చెప్పిందట

ఫేస్‌బుక్ కంపెనీ రాకెట్ వేగంతో ఎదిగింది. అలా ఎదగడం వెనుక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, సీవోవో షెరైల్ శాండ్‌బెర్గ్ కృషి ఎంతైనా ఉంది. అయితే కంపెనీని పరుగులు పెట్టించే ఆతృతలో వారు హెచ్చరికలు పెడచెవిన పెట్టారు. సమాచారం దాచిపెట్టారు. ఇవీ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన ఓ పరిశోధనాత్మక కథనంలో చోటుచేసుకున్న ఆరోపణలు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యన్ హ్యాకర్లు ఫేస్‌బుక్ డేటాను ఉపయోగించుకోవడంపై కంపెనీ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆ పత్రిక బయటపెట్టింది. అంతేకాకుండా తన విమర్శకులను యూదువ్యతిరేకులని ముద్రవేసి లేదా సామాజికి కార్యకర్తలను బిలియనీర్ పెట్టుబడిదారు జార్జి సోరోస్ మనుషులని ప్రచారం చేసి ఎదురుగదాడికి దిగింది.

ప్రజల ఆగ్రహాన్ని ప్రత్యర్థ్థి టెక్ కంపెనీలపైకి మళ్లించాలని చూసిందని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఫేస్‌బుక్ డేటాను కేంబ్రిజ్ అనలిటికా సంస్థ దురుపయోగం చేసిందని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఖండనలతోనే సరిపెట్టింది. కానీ అంతర్గతంగా జరిగిన సమావేశాల్లో అది నిజమేనని ఒప్పుకున్నారు. ఏ సంక్షోభం వచ్చినా వాయిదా వేయడం, ఖండించడం, పక్కదారి పట్టించడం అనే మూడుసూత్రాల మార్గాన్ని అనుసరించిందని పేర్కొన్నది. 50 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, ఇతర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, లాబీయిస్టులు, కాంగ్రెస్ సిబ్బందిని ఇంటర్వూ చేసినట్టు తెలిపింది. తాజాగా ముగిసిన ?ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో ఆధిక్యం సాధించిన నేపథ్యంలో ఈ కథనం రాజకీయ సంచలనాలకు తెరతీసే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు.

Related Stories: