యువతుల పేరుతో ఫేస్‌బుక్ ఐడీలు

హైదరాబాద్ : అమ్మాయిల పేరుతో ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి, మహిళలు, యువతులను పరిచయం చేసుకొని... ఆ తరువాత నగ్న ఫొటోలు పంపించాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న పాల్వంచకు చెందిన ఓ సైబర్‌చీటర్‌ను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఓల్డ్ సూరారంకు చెందిన సోమిశెట్టి సాయి కృష్ణ ప్రైవేట్ ఉద్యోగి. ఫేస్‌బుక్‌లో మాధవీనాయుడు, సాయి స్వప్న నాయుడు పేరుతో ఫేస్‌బుక్‌లో రెండు ఖాతాలు క్రియేట్ చేసి... 350 మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఇందులో ఎక్కువ మంది మహిళలు, యువతులే ఉన్నారు. మహిళ పేరుతో ఉన్న ఐడీ కావడంతో కొందరు ఫ్రెండ్ షిప్‌కు అంగీకరించారు. ఇలా అంగీకరించిన వారికి సంబంధించిన ఫొటోలను ఆయా ఖాతాల నుంచి సేకరించి, వాటిని మార్పింగ్ చేశాడు. ఆయా మార్పింగ్ ఫొటోలను బాధితుల ఐడీలకు పంపించి, అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. మీ నగ్న చిత్రాలు పంపించకపోతే.. మార్పింగ్ చేసిన ఫొటోలన్నీ స్నేహితులు, బంధువుల ఐడీలకు పంపించి ఇజ్జత్ తీసేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. దీంతో బాధితులు ఒక గుర్తుతెలియని వ్యక్తి తమను ఫేస్‌బుక్ ద్వారా వేధిస్తున్నాడంటూ ఎల్బీనగర్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పాల్వంచకు చెందిన వాడుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Related Stories: