ఆసీస్‌కు ఆరు అందేనా..

కప్పు కొట్టాలన్నా మేమే.. దాన్ని నిలబెట్టుకోవాలన్నా మేమే. వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఆటతీరు ఇది. క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్‌లోనే అయినా.. దాన్ని ఎక్కువ కాలం ఏలింది మాత్రం ఆస్ట్రేలియానే. గత పాతికేండ్లలో కంగారూలు ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్నారంటేనే ప్రత్యర్థులను ఎంత కంగారుపెడతారో అర్థమవుతున్నది. ఐపీఎల్‌లో మిగతా జట్లన్ని ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడేందుకు ఎలా పోటీపడతాయో.. వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కథ కూడా ఇంచుమించు అదే. మూడు నెలల కింద ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ఫైనల్ చేరుతుందని ఎవరన్న అంటే నవ్విపోయేవాళ్లు. సొంతగడ్డపై తొలిసారి భారత్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయి డీలాపడ్డా ఆసీస్ అదే నిస్సత్తువతో ఇండియా టూర్‌కు వచ్చింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఘోరంగా ఓడింది. ఇంకేముంది సిరీస్ కోహ్లీసేన చేతచిక్కడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అసాధారణ ఆటతో అదరగొట్టింది. వరుసగా మూడు వన్డేలు నెగ్గి 3-2తో సిరీస్ చేజిక్కించుకుంది. అటునుంచి పాకిస్థాన్‌పై దండయాత్రకు వెళ్లింది. భారత్‌తో ఓ మాదిరిగా ఆడిన ఫించ్ సేన.. పాక్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగి ఫుల్ స్వింగ్‌లోకి వచ్చింది. నిషేధం పూర్తి చేసుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో చేరడం ఆసీస్‌కు మరింత బలాన్నిచ్చింది. సరిపడ వనరులు ఉన్న డిఫెండింగ్ చాంపియన్ మరోసారి కప్పును హస్తగతం చేసుకొని సిక్సర్ కొడుతుందేమో చూడాలి. Warner నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచకప్ ప్రారంభమైన తొలినాళ్లలో వెస్టిండీస్ ఆధిపత్యం చెలాయిస్తే.. ఆ తర్వాత ఆస్ట్రేలియా అల్లాడించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు 11 టోర్నీలు జరిగితే.. అందులో ఐదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) కప్పు చేజిక్కించుకుంది. రెండు సార్లు (1975, 1996) రన్నరప్‌గా నిలిచింది. ఓ సారి క్వార్టర్స్ (2011)లో ఓడింది. అయితే ఇటీవల ఆసీస్ కాస్త కళ తప్పింది. నాణ్యమైన ఆటగాళ్లు జట్టుకు దూరమవడంతో ఇబ్బంది పడింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆసీస్‌ను బాల్ ట్యాంపరింగ్ ఉదంతం మరింత ఇక్కట్లకు గురిచేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన బాన్‌క్రాఫ్ట్, వార్నర్‌లతో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిషేధం విధించింది. దీంతో ఆసీస్ జట్టు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి లో పడ్డైట్లెంది. వరుసగా రెండేండ్ల పాటు కనీసం ఒక్క సిరీస్ కూడా గెలువలేకపోయింది. ఆరు ద్వై పాక్షిక సిరీస్‌ల్లో ఓటమి చవిచూసింది. ఇలాంటి గడ్డు కాలంలో కంగారూలు తమలోని అసలు సిసలు పోరాటయోధుల్ని నిద్రలేపారు. మెగాటోర్నీకి ముందు సూపర్ ఫామ్‌ను అందిపుచ్చుకున్నారు. ట్యాంపరింగ్‌తో చుట్టుముట్టిన ఇక్కట్లను దూరం చేసుకొని మరోసారి ట్రోఫీని ముద్దాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఐదు టైటిళ్లతో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న ఆస్ట్రేలియా మరోసారి కప్పు కైవసం చేసుకుంటుందా త్వరలోనే తేలనుంది. మెగాటోర్నీలో జూన్ 1న ఆఫ్ఘనిస్థాన్‌తో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఆడనుంది. smith

బలాలేంటి..

ఏడాది నిషేధం తర్వాత బరిలో దిగనున్న వార్నర్, స్మిత్‌లే ఆస్ట్రేలియాకు ప్రధాన బలం. రక్తం రుచి మరిగిన పులి ఎంత కసిగా వేటాడుతుందో.. పరుగుల దాహంతో ఉన్న వార్నర్ అంతకంటే ఎక్కువ ప్రవాహం సృష్టించాలనే పట్టుదలతో ఉన్నాడు. సినిమాకు ముందు ట్రైలర్‌లా.. వన్డేలకు ముందు ఐపీఎల్‌లో రఫ్ఫాడించాడు. ఇక స్మిత్ తన చిత్రవిచిత్ర స్టాన్స్‌తో అదరగొట్టేందుకు రెడీ అయిపోయాడు. టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడ్డ ఉస్మాన్ ఖవాజ వన్డేల్లో విజృంభిస్తుండటం కంగారూలకు కలిసొచ్చే అంశం. కెప్టెన్ ఫించ్, షాన్ మార్ష్ ఎంతటి విధ్వంసకారులో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, స్టోయినిస్ ఆసీస్‌కు ప్రధాన అస్ర్తాలనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభంలో టీమ్‌ఇండియాపై మ్యాక్స్‌వెల్ చెలరేగిన తీరును ఇప్పుడప్పుడే అభిమానులు మరిచి ఉండరు. ప్రస్తుత క్రికెట్‌లో స్టోయినిస్ అత్యంత విలువైన ఆటగాడని టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడంటే అతడి సత్తా ఏంటో తెలుస్తున్నది. బౌలింగ్‌లోనూ సరిపడ ఆయధాలు ఉన్నయి. సీనియర్ పేసర్ స్టార్క్‌తో పాటు కమ్మిన్స్, కౌల్టర్‌నైల్, బెహ్రెన్‌డార్ఫ్‌తో పేస్ బౌలింగ్ భీకరంగా ఉంది.

బలహీనతలేంటి..

ఏడాది నిషేధం అనంతరం ఇద్దరు ప్లేయర్లు జట్టులో చేరడం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. దీనికితోడు కంగారూల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఇంగ్లండ్ అభిమాన గణం బార్మీ ఆర్మీ చీటర్లు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టింది. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని వార్నర్, స్మిత్ ఏమేరకు రాణిస్తారో చూడాలి. వీరి గైర్హాజరీలో ఫించ్, ఖవాజ ఓపెనర్లుగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఖవాజా భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. ఇప్పుడు వార్నర్ రాకతో అతడి స్థానంపై అనిశ్చితి నెలకొంది. బ్యాకప్ వికెట్ కీపర్ లేకపోవడం కూడా లోటే. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే హ్యాండ్స్‌కోంబ్‌ను జట్టు నుంచి తప్పించడం ఫలితంపై ప్రభావం చూపే అవకాశముంది. మణికట్టు స్పిన్నర్లను ఎదుర్కొవడంలో జట్టు కాస్త వెనుకంజలో ఉంది. నిఖార్సైన బ్యాట్స్‌మన్ ఎదురుగా నిల్చుంటే.. బౌలింగ్ చేయడంలో తడబడే ఆడమ్ జంపా ఏం చేస్తాడో చూడాలి. నాథన్ లియాన్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువే.

అంచనా

ఐసీసీ టోర్నమెంట్‌లలో బీభత్సంగా ఆడే ఆస్ట్రేలియా ఎప్పుడూ ప్రమాదకర జట్టే. అనూహ్య ఫలితాలు ఎదురుకాకుంటే ఫైనల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆస్ట్రేలియా జట్టు

అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, లియాన్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ కౌల్టర్‌నైల్, ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్, కేన్ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. coach-langer