టీఆర్‌ఎస్‌లోకి మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.. త్వరలోనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ ఉదయం సురేశ్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించిన సురేశ్ రెడ్డి.. త్వరలోనే తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతానని ప్రకటించారు. ఈ నెల 12న తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు సురేశ్ రెడ్డి. సురేశ్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తాం : కేటీఆర్ ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి సభాపతిగా అందరి మన్ననలు అందుకున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో సురేశ్ రెడ్డికి మాకు భావసారూప్యత ఉండేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో సురేశ్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ ఆహ్వానాన్ని అంగీకరించి.. పార్టీలోకి వస్తున్న సురేశ్ రెడ్డికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నిశ్శబ్ద అభివృద్ధి విప్లవం : సురేశ్ రెడ్డి రాష్ట్రంలో నాలుగున్నరేండ్ల నుంచి నిశ్శబ్ద అభివృద్ధి విప్లవాన్ని చూశానని మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే.. మళ్లీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి రావాలన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్‌ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించాను. తెలంగాణకు ఇప్పుడు అత్యంత కీలకమైన సమయం. వ్యవసాయం, సాగునీటి రంగంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుంది. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయి. రాజకీయ అవసరాల కంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు మాజీ స్పీకర్. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు తనను ఆకర్షించాయి. టీఆర్‌ఎస్‌లోకి రావడంలో రాజకీయ లబ్ధి చూసుకోవడం లేదని .. త్వరలోనే కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతానని సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. సురేశ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సురేశ్ రెడ్డి. 2004-09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సురేశ్ రెడ్డి స్పీకర్‌గా సేవలందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్పీకర్ పని చేసిన మొదటి వ్యక్తి సురేశ్ రెడ్డే. 1984లో మండల స్థాయి లీడర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం