పాక్ మాజీ ప్రధాని షరీఫ్ భార్య కన్నుమూత

లండన్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్సుం షరీఫ్(68) మంగళవారం కన్నుమూసింది. గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్న కుల్సుం.. లండన్‌లోని హార్లే స్ట్రీట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2014 నుంచి ఆమె గొంతు క్యాన్సర్‌తో బాధపడుతుంది. కుల్సుం మరణ వార్త తెలుసుకున్న నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్, అల్లుడు మహ్మముద్ సఫ్దార్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, మహ్మముద్ సఫ్దార్‌లకు 12 గంటల పెరోల్ లభించింది. దీంతో వారు రావల్సిండిలోని అడియాలా జైలు నుంచి మంగళవారం రాత్రే లండన్‌కు బయల్దేరారు. అయితే కుల్సుం అంత్యక్రియలు లాహోర్‌లో శుక్రవారం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పెరోల్ ఇవ్వాలని కోర్టుకు విన్నవించినప్పటికీ 12 గంటల పెరోల్ మాత్రమే ఇచ్చింది. 1950లో లాహోర్‌లోని ఓ కశ్మీరి కుటుంబంలో జన్మించిన కుల్సుం.. 1971లో నవాజ్ షరీఫ్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి నలుగురు సంతానం.. హసన్, హుస్సేన్, మరియం, ఆస్మా.

Related Stories: