వీవీప్యాట్లతో అనుమానాలకు చెల్లు

-కొత్త టెక్నాలజీతో ఈవీఎంలు -ఓటు వేయగానే.. ధ్రువీకరిస్తూ రసీదు -ఏడు క్షణాల అనంతరం తిరిగి బాక్సులోకి -రానున్న ఎన్నికల్లో వినియోగించనున్న ఈసీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, అపోహలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సరికొత్త టెక్నాలజీతో ఈవీఎంలను తయారుచేస్తున్నది. ఓటరు తనకు నచ్చి న అభ్యర్థికి ఓటేస్తే అది మరొకరికి పడుతున్నదనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకు అవకాశాలున్నాయని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు కొంతకాలం క్రితం బహిరంగ సవాల్‌చేసి తప్పిదాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. అప్పటినుంచి దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేస్తూ, వాటి స్థానంలో పేపర్ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఈవీఎంలతోపాటు వాటికి అమర్చే వీవీప్యాట్స్ (ఓటర్ వెరిఫైబల్ పేపర్ ఆడిట్ ట్ర యల్)ను ఎన్నిక సంఘం తయారుచేయిస్తున్నది. దాదాపు నాలుగు లక్షల ఈవీఎంలు భెల్ కంపెనీల్లో తయారవుతున్నాయి. తెలంగాణతోపాటు నాలుగు రాష్ర్టాల ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగించాలని సీఈసీ నిర్ణయించింది. రాష్ట్రంలో 32,573 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సుమారు 42 వేల ఈవీఎంలు అవసరముంటాయని అంచనావేస్తున్నారు.

వీవీ ప్యాట్ ఇలా పనిచేస్తుంది..

వీవీప్యాట్ మిషన్‌ను ఓటింగ్ యంత్రానికి అనుసంధానం చేస్తారు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న మీటను నొక్కిన తర్వాత అదే అభ్యర్థికి ఓటు పడిందని ధ్రువీకరిస్తూ ఒక రసీదు పక్కనే ఉన్న ప్రత్యేకమైన బాక్సులో కనిపిస్తుంది. ఏడు సెకండ్లపాటు కనిపించే ఈ రసీదు.. తిరిగి బాక్సులో పడిపోతుంది. వీటిని ఎన్నికల కమిషన్ భద్రపరుస్తుంది. ఎవరైనా అభ్యర్థి ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేసినా, కోర్టుకు వెళ్లినా వీవీప్యాట్‌లో రికార్డయిన రసీదులను ఎన్నికల సంఘం ఆధారంగా చేసుకుంటుంది.