పీఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికీ బీడీల పెన్షన్

కామారెడ్డి: ప్రస్తుతం బీడీ కార్మికులకు 2014 వరకు పీఎఫ్ ఉంటే పెన్షన్ ఇస్తున్నామని, అది ఇప్పుడు 2014 తర్వాత పీఎఫ్ ఉన్న వారికి సైతం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని టీఆర్‌ఎస్ బాన్సువాడ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ విషయం ఆర్మూర్‌లో జరిగే సభలో కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారన్నారు. దీని కారణంగా రాష్ట్రంలో దాదాపు 20 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్ క్యాంపు, అంకోల్, అంకోల్ తండా, హాజీపూర్, సంగం గ్రామాల్లో ఆయన ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణం కేవలం కేసీఆర్ పాలనతోనే సాధ్యం అని అన్నారు. రైతులకు సీఎం పెద్ద పీట వేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేసి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించామని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందించామన్నారు. వచ్చే జూన్ వరకు కాళేశ్వరం నుంచి నిజాంసాగర్ వరకు నీటిని తెచ్చి రెండు పంటలకు కాదు మూడు పంటలకు సైతం నీరు అందిస్తామన్నారు. ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామన్నారు. పంట పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామని చెప్పారు.

Related Stories: