ఆరోగ్య బీమాపై ఆర్థికమంత్రికి కూడా తెలియదేమో

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యబీమా పథకంపై కనీసం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా తెలియదేమోనని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. జైట్లీ నిన్న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌పై అధ్యయనం అనంతరం ఎంపీ వినోద్ తన స్పందనను తెలియజేస్తూ.. కనీసం సంస్కరణలు చేపట్టే విధంగా కూడా కేంద్ర బడ్జెట్ లేదన్నారు. యథాతథస్థితి మాదిరిగానే కేంద్ర బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదని తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేసినట్లు ఎకనామిక్ సర్వేలో వచ్చిందన్నారు. ఉత్పత్తి రంగాలపై శ్రద్ధ తీసుకోలేదని చెప్పారు. 10 కోట్ల కుటుంబాలు.. 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం ప్రకటించారు. 10 కోట్ల కుటుంబాల్లో ఏఏ కుటుంబాలు ఉంటాయో చెప్పలేదు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆరోగ్యబీమా పథకంగా చెప్పారు. ఇప్పటి వరకు ఆరోగ్య బీమా పథకం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆరోగ్యబీమా పథకం పేరిటి ఆశలు రేకెత్తించారు. కానీ ఇందుకు బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఎలాంటి కసరత్తు చేయకుండా బడ్జెట్‌లో ప్రవేశపెట్టడం సరికాదు. ఆరోగ్యబీమా పథకంపై పార్లమెంటులో స్పష్టం చేయాలని పేర్కొన్నారు.
× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు