భార‌త్‌తో తొలి టెస్ట్‌.. ఓటమి కోరల్లో ఆసీస్‌

అడిలైడ్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పర్యాటక భారత జట్టును గెలుపు ఊరిస్తోంది. అడిలైడ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో కంగారూలు ఆల్‌రౌండ్ వైఫల్యంతో ఓటమి కోరల్లో చిక్కుకున్నారు. అశ్విన్(2/44), మహ్మద్ షమీ(2/15) దెబ్బకు.. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదివారం ఆట చివరకు ఆసీస్ 104/4తో కష్టాల్లో పడింది. ఇక విజయానికి కంగారూలు 219 పరుగులు, భారత్ 6 వికెట్ల దూరంలో ఉన్నారు. షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు పుజరా(71), రహానె(70) రాణించడంతో.. ఓవర్‌నైట్ స్కోరు 151/3తో నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీసేన 307 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను ఆదుకున్న హెడ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఎంత తొంద‌ర‌గా ఔట్ చేస్తే భార‌త్ అంత వేగంగా విజ‌యాన్ని అందుకునే ఛాన్స్ ఉంది. ఆఖ‌రి రోజు కూడా భార‌త బౌల‌ర్లు ఇదే జోరుతో బౌలింగ్ చేస్తేనే ఫ‌లితం ఉంటుంది. ఛేదనలో ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. 12వ ఓవర్లో అరోన్ ఫించ్(11)ను అశ్విన్ పెవిలియన్ చేర్చి దెబ్బతీశాడు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్ ఏదశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మార్కస్ హారీస్(26)ను షమీ, ఉస్మాన్ ఖవాజా(8)ను అశ్విన్ ఔట్ చేసి టాపార్డర్ కుప్పకూల్చారు. తర్వాత హాండ్స్‌కాంబ్, షాన్ మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా వేట కొనసాగించారు. ఈ జోడీని మహ్మద్ షమీ విడదీశాడు. ఆఖర్లో షాన్ మార్ష్(31), ట్రావిస్ హెడ్(11) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆటకు సోమవారమే ఆఖరి రోజు, కంగారూలు ఓటమి తప్పించుకోవాలంటే లోయరార్డర్ అద్భుత పోరాట నైపుణ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది.

Related Stories: