ఓట‌ర్ల జాబితా సవరణకు ఈఆర్వోనెట్‌-2.0 సాఫ్ట్‌వేర్..

హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం ఓట‌ర్ల జాబితాను మ‌రింత ప్రక్షాళన చేసేందుకుగాను ఈఆర్వోనెట్‌-2.0 అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్‌కుమార్ తెలిపారు. ఓట‌ర్ల జాబితా త‌యారీలో ప్రస్తుతం ఎల‌క్టోర‌ల్ రోల్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఇ.ఎం.ఆర్‌.ఎస్‌) అనే సాఫ్ట్‌వేర్ స్థానంలో ప్రవేశపెట్టిన ఈఆర్వోనెట్ -2.0 వెర్షన్ పై రాష్ట్రంలోని 31 జిల్లాల‌కు చెందిన ఎన్నిక‌ల నిర్వహణ త‌హశీల్దార్లు, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లకు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్నిసిఈవో ర‌జ‌త్‌కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ..ఓట‌ర్ల జాబితా ప్రక్షాళ‌న‌కుగాను దేశ‌వ్యాప్తంగా ఏక‌రూప సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం అంద‌జేసింద‌న్నారు. ఈఆర్వోనెట్‌-2.0 వెర్షన్ ప్రకారం ఒకే ఓట‌రు రెండు మూడు ప్రాంతాల్లో ఓటును క‌లిగి ఉండ‌డాన్ని గుర్తిస్తుంద‌ని, ఓట‌ర్ల బదిలీ, పేర్ల మార్పిడి, మ‌ర‌ణించిన ఓట‌ర్ల తొల‌గింపు త‌దిత‌ర అంశాలు సుల‌భంగా చేప‌ట్టవ‌చ్చున‌ని ఆయ‌న తెలిపారు. ఈఆర్వోనెట్-2.0 ద్వారా నకిలీ ఓటర్లను సుల‌భంగా ఏరివేయ‌వ‌చ్చని, ఈ కార్యక్రమంలో ఓట‌ర్ల వివ‌రాల‌తోపాటు ఫోటోను ఎంట‌ర్ చేస్తే స్పష్టమైన స‌మాచారం ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్రకారం జ‌న‌వ‌రి 1వ తేదీలోగా ఓట‌ర్ల జాబితాను పూర్తిచేయాల‌ని రజత్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు సార్లు ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ చేప‌ట్టడం జ‌రిగింద‌ని, ఓట‌ర్ల ముసాయిదాను సెప్టెంబ‌ర్ 1వ తేదీన ప్రకటించామని తెలిపారు. ఓట‌ర్ల జాబితాపై త‌మ అభ్యంత‌రాల‌ను తెలియ‌జేయ‌వ‌చ్చని తెలిపారు. హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

× RELATED ఈ సారి నాగ‌శౌర్య‌తో మెగా హీరో మ‌ల్టీ స్టార‌ర్..!