వార్నర్ 99 ఔట్.. కానీ..!

మెల్‌బోర్న్‌ః ఇంగ్లండ్ బౌలర్లు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చారు. అది మామూలు గిఫ్ట్ కాదు. కెరీర్‌లో రికార్డు సెంచరీ చేసే చాన్స్. మెల్‌బోర్న్‌లో మొదలైన బాక్సింగ్ డే టెస్ట్‌లో వార్నర్‌కు ఆ అవకాశం ఇచ్చారు. 99 పరుగుల దగ్గర ఉన్నపుడు ఇంగ్లండ్ బౌలర్ టామ్ కురన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు వార్నర్. అప్పటివరకు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఉర్రూతలూగించిన వార్నర్.. సెంచరీని మిస్సయ్యాడే అని ఎంసీజీలోని ప్రేక్షకులు ఉసూరుమన్నారు. వార్నర్ కూడా సైలెంట్‌గా పెవిలియన్ వైపు నడిచాడు. అయితే రీప్లేల్లో కురన్ నోబాల్ వేసినట్లు తేలడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వచ్చిన అవకాశాన్ని అతను వదులుకోలేదు. తర్వాత బాల్‌కే సింగిల్ తీసి సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతనికిది 21వ సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో అత్యంత వేగంగా 21 సెంచరీలు చేసిన వారిలో సునీల్ గవాస్కర్ తర్వాత స్థానం అతనిదే. మరో ఆస్ట్రేలియన్ హేడెన్‌తో కలిసి వార్నర్ రెండోస్థానంలో నిలిచాడు. అయితే సెంచరీ చేసిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కాసేపటికే 103 పరుగుల దగ్గర ఆండర్సన్ బౌలింగ్‌లో వార్నర్ ఔటయ్యాడు. ఆండర్సన్‌కు యాషెస్‌లో ఇది వందో వికెట్ కావడం మరో విశేషం. కెరీర్‌లో 70వ టెస్ట్ ఆడుతున్న వార్నర్.. ఇదే ఇన్నింగ్స్‌లో 6 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.
× RELATED ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం