17 ఏండ్ల తర్వాత..

-లంకలో టెస్ట్ సిరీస్ గెలిచిన ఇంగ్లండ్
క్యాండీ: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు.. ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో 57 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా 17 ఏండ్ల తర్వాత లంక గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న ఘనతను అందుకుంది. చివరిసారి 2001లో నాసిర్ హుస్సేన్ సారథ్యంలోని ఇంగ్లండ్ లంకలో 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. 301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 226/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి రోజు 75 పరుగులు చేయాల్సిన దశలో కేవలం 17 పరుగులు మాత్రమే జోడించి చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. మొయిన్ అలీ (4/72) ఒకే ఓవర్‌లో మూడు బంతుల తేడాలో డిక్‌వెల్లా (35), లక్మల్ (0)ను ఔట్ చేయగా, పుష్పకుమార (1)ను లీచ్ (5/83) పెవిలియన్‌కు పంపడంతో చిరస్మరణీయ విజయం సొంతమైంది. రూట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.