క్రికెట్‌కు అలిస్టర్ కుక్ గుడ్ బై

లండన్: ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇండియాతో వచ్చే శుక్రవారం మొదలయ్యే చివరి టెస్టే తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని కుక్ ప్రకటించాడు. 33 ఏళ్ల కుక్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో ఆరోస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. అతని సగటు 44.88. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ అతడే. ఒకదశలో సచిన్ రికార్డులు బద్ధలు కొడతాడని అందరూ భావించినా.. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అతని సగటు కేవలం 18.62 మాత్రమే. ఇండియాతో జరుగుతున్న సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. మూడు అంతకన్నా ఎక్కువ టెస్టుల్లో కనీసం ఒక్క 50 ప్లస్ స్కోరు కూడా చేయకపోవడం కుక్‌కు ఇదే తొలిసారి. అంతేకాదు 2008 నుంచి క్యాలెండర్ ఇయర్ తొలి 9 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం కూడా అతనికి ఇదే తొలిసారి కావడం గమనార్హం. రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినా.. నేను క్రికెట్ కోసం అన్నీ ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. నేను ఎప్పుడూ ఊహించని రికార్డులను సాధించాను. ఇంగ్లండ్‌లో గ్రేట్ ప్లేయర్స్‌తో ఇంతకాలం ఆడాను. అయితే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావించాను అని కుక్ తన ప్రకటనలో చెప్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 6 వేలు, 7 వేలు, 8 వేలు, 9 వేలు, పది వేలు, 11 వేలు, 12 వేల పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు కుక్ పేరిటే ఉంది. ఇంగ్లండ్‌కు 59 టెస్టుల్లో కెప్టెన్సీ కూడా వహించాడు. 2013, 2015 యాషెస్ సిరీస్‌లు గెలిచాడు. ఇండియా, సౌతాఫ్రికాల్లో సిరీస్ విజయాలు సాధించిన ఘనత కూడా కుక్ సొంతం.

కుక్ రికార్డులు:

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు: 12254 ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు: 32 ఇంగ్లండ్ తరఫున అత్యధిక 150+ స్కోర్లు : 11 ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు : 160 విరామం లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ : 158 టెస్టులు ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టులు: 59

Related Stories: