అండ‌ర్స‌న్ ఖాతాలో 500 వికెట్లు

లార్డ్స్: ఇంగ్లండ్ స్పీడ్ బౌల‌ర్‌ జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన మొద‌టి ఇంగ్లండ్ బౌల‌ర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న ఆఖ‌రి టెస్టులో ఈ రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీలో ల్యాంకిషైర్ త‌ర‌పున అండ‌ర్స‌న్ ఆడుతాడు. స్వింగ్ బౌలింగ్‌లో అత‌ను దిట్ట‌. విండీస్ రెండ‌వ ఇన్నింగ్స్‌లో క్రేగ్ బ్రెత్‌వెయిట్‌ను ఔట్ చేసిన అండ‌ర్స‌న్ ఈ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ప్లేయ‌ర్ల‌లో అండ‌ర్స‌న్ ఆర‌వ బౌల‌ర్‌. మిగ‌తా అయిదుగురు బౌల‌ర్లు ఇప్ప‌టికే రిటైర్ అయ్యారు. 500 వికెట్ల రికార్డ‌ను అందుకోవ‌డం రిలీఫ్‌గా, కొంత ఎమోష‌న‌ల్‌గా ఉంద‌ని అండ‌ర్స‌న్ తెలిపాడు. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ముర‌ళీధ‌ర‌న్ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 800 వికెట్లు ఉన్నాయి. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా లెగ్ స్పిన్న‌ర్ షేన్ వార్న‌ర్ 708 వికెట్లతో రెండ‌వ స్థానంలో నిలిచాడు. 619 వికెట్ల‌తో కుంబ్లే మూడ‌వ స్థానంలో ఉన్నాడు. జేమ్స్ అండ‌ర్స‌న్ 2003లో లార్డ్స్ టెస్టుతో అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ప్ర‌స్తుతం అత‌ను 129వ టెస్టు ఆడుతున్నాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో స్టువ‌ర్ట్ బ్రాడ్ 387, ఇయాన్ బోథ‌మ్ 383 వికెట్లు తీశారు.

Related Stories: