ముక్కోణపు ప్రేమకథ

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వినూత్న కథాంశాలతో తెరకెక్కుతున్న చిన్న చిత్రాలన్ని పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. ఆ జాబితాలో మా సినిమా నిలుస్తుంది అని అన్నారు. కోటి వద్దినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎందుకో ఏమో. నందు, నోయల్, పునర్నవి భూపాలం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాలతి వద్దినేని నిర్మాత. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుడు కోటి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. ఇద్దరబ్బాయిల కారణంగా ఓ అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. కుటుంబ బంధాలతో పాటు అంతర్లీనంగా చక్కటి వినోదం మిళితమై సాగుతుంది. ఇదివరకు తెలుగుతెరపై వచ్చిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీస్‌కు భిన్నంగా ఉంటుంది. గుంటూరుజిల్లాలోని కర్లపూడి నా స్వస్థలం. పోసాని కృష్ణమురళి నాకు బంధువు అవుతారు. ఆయన వద్ద శ్రావణమాసంతో పాటు పలు సినిమాలకు రచన దర్శకత్వం విభాగంలో పనిచేశాను. కథపై ఉన్న నమ్మకంతో దర్శకత్వం వహించడంతో పాటు నేనే సొంతంగా ఈ సినిమాను నిర్మించాను అని తెలిపారు