ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..

కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు దళ సభ్యురాలు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఛత్తీస్‌గఢ్ డీఐజీ (యాంటీ-నక్సల్స్ ఆపరేషన్స్) సుందర్‌రాజన్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సల్స్ కార్యకలాపాలను నిర్మూలించేందుకు జిల్లా రిజర్వు గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ భద్రతా బలగాలు సంయుక్త ఆధ్వర్యంలో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఫూల్‌బగ్డీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్ధపార అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరుపడంతో మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూనే దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.

కాల్పుల విరమణ అనంతరం సంఘటన స్థలం నుంచి ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నాయి. మృతి చెందిన సదరు మహిళా మావోయిస్టు బేడెసెట్టి లోకల్ ఆర్గనైజింగ్ స్కాడ్ (ఎల్‌ఓఎస్) హేమ్లా అయాతిగా గుర్తించినట్లు డీఐజీ సుందర్‌రాజన్ ధ్రువీకరించారు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డిప్యూటీ దళ కమాండర్ చింగ మృతి చెందిన విషయమం విదితమే. ఇంక భద్రతా బలగాలు గాలింపులను మరింత ముమ్మరం చేస్తున్నాయని డీఐజీ వివరించారు.

Related Stories: