ఇదే రోజు కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం..

ముంబై: పదకొండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు(18-08-2008) విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా 8వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అజంతా మెండిస్, మురళీధరన్‌ల ధాటికి 147పరుగులకే కుప్పకూలింది. మొదటి మ్యాచ్‌లో కోహ్లి చేసింది 12పరుగులు మాత్రమే. ఈ మ్యాచ్‌లో తను నువాన్ కులశేఖర బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లంక 34.2ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కోహ్లి మొదటి మ్యాచ్ అభిమానుకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం కోహ్లి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా విజయవంతంగా కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డులు.. ఒక దశాబ్ద కాలంలో 20వేల పైచిలుకు పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ విరాట్. కోహ్లి ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 68సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో43, టెస్టుల్లో 25 సెంచరీలున్నాయి. ఇవికూడా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రావడం గమనర్హం. 30సంవత్సరాల ఈ దిగ్గజ ఆటగాడిలో ఇంకా ఆట మిగిలుందనడంలో సందేహం లేదు. ఇంకా ఎన్ని పరుగులు, ఎన్ని సెంచరీలు సాధిస్తాడో చూడాలి. దాదాపు సచిన్ రికార్డులన్నీ బద్దలు కొడుతున్న కోహ్లి అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించాలని ఆశిద్దాం.