ఈఫిల్ టవర్‌కు 130 ఏళ్లు.. లేజర్ షోతో మెరిసిన టవర్.. వీడియో

పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించి నేటికి 130 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఈఫిల్ టవర్ వద్ద లేజర్ షోను ఏర్పాటు చేశారు. ఈ లేజర్ షోను చూడటానికి పారిస్ ప్రజలంతా పెద్ద ఎత్తున ఈఫిల్ టవర్ వద్దకు చేరుకున్నారు. లేజర్ షో ద్వారా ఈఫిల్ టవర్ ప్రాముఖ్యతను పర్యాటకులకు, పారిస్ ప్రజలకు తెలియజేశారు. 1889లో ఈఫిల్ టవర్‌ను నిర్మించారు. 324 మీటర్ల ఎత్తు, 7300 టన్నుల బరువు ఉండే ఈఫిల్ టవర్‌కు ఎంతో చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం ఈ టవర్‌ను సుమారు 70 లక్షల మంది దాకా సందర్శిస్తారు. నిజానికి ఈ టవర్‌ను 1889లో జరిగిన వరల్డ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కోసం నిర్మించారు. తర్వాత దీన్ని కూలగొట్టాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. ఇది టూరిస్టులను ఆకర్షిస్తుండటం.. రోజురోజుకూ టూరిస్టుల తాకిడి పెరుగుతుండటంతో దాన్ని కూల్చే ప్రక్రియను ఆపేశారు. పారిస్‌లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో ఈఫిల్ టవర్ ముందు ప్లేస్‌లో ఉంటుంది. పారిస్ వచ్చామంటే ఖచ్చితంగా ఈఫిల్ టవర్ చూడాల్సిందే.. అంటోంది కెనడాకు చెందిన ఓ టూరిస్ట్. న్యూయార్క్‌లో 1930లో క్రిస్లెర్ బిల్డింగ్ నిర్మించడానికి ముందు 41 ఏళ్ల వరకు ప్రపంచంలోనే అతి పొడవైన టవర్‌గా ఈఫిల్ టవర్ ప్రసిద్ధిగాంచింది. గత సంవత్సరం టవర్‌లోని కొన్ని మెట్లను సుమారు 170,000 యూరోలకు అమ్మేశారు.