కారు ఢీకొని బాలుడు మృతి

కొండమల్లేపల్లి : కారు ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జోగ్యాతండా సమీపంలో నాగార్జునసాగర్-హైదరాబాద్ హైవేపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన రమావత్ బాలు, జానిల కుమారుడు రమావత్ పవన్(11) మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో తండా సమీపంలో తన తోటి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన నిల్చుని ఉండగా హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లి వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బాలుడిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు బాలుడి మృతదేహంతో రహదారిపై సుమారు గంటపాలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కొండమల్లేపల్లి సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి వారి ఆందోళనను విరమింపజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Stories: