కులవృత్తుల ద్వారా జీవనోపాధికి సబ్సిడీతో రుణాలు..

వనపర్తి: కుల వృత్తుల ద్వారా జీవనోపాధి కల్పించే విధంగా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు 100% సబ్సిడీతో ఋణాలు అందించి, వారు సొంతంగా వ్యాపారం చేసుకోడానికి మార్కెట్ యార్డులు నిర్మించి ఇవ్వడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం వనపర్తిలోని సంగం ఫంక్షన్ హాల్ లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యశాఖ లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో మహమూద్ అలీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో రకాల పథకాలు పంపిణీ చేయడం జరిగిందని, దానిలో భాగంగా వనపర్తి, ఖిల్లా ఘన్ పూర్, పెబ్బేర్ లలో షాదీఖాన, అంబేద్కర్ భవనాల కోసం రూ.2 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. వేరే మండలాల్లో కూడా దశలవారీగా నిధులు విడుదల చేసి అంబేద్కర్ భవనాలు, షాది ఖానాలు నిర్మిస్తామన్నారు. పేద ప్రజల కొరకు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, ఇందులో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు పూర్తి స్థాయి సబ్సిడీతో ఋణాలు అందజేయటం జరిగిందన్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ లెవెన్త్ ఫెడరేషన్ తరఫున 55 మంది లబ్దిదారులకు 27 లక్షల 50 వేల రూపాయల చెక్కులను అందిస్తున్నామని, అలాగే మత్స్యశాఖ తరపున మహిళ మత్స్య పారిశ్రమ సహకార సంఘ సభ్యులకు 20 లక్షల రూపాయల చెక్కులతోపాటు మత్స్య కారులకు టీవీఎస్ ఎక్స్ ఎస్ మోపెడ్ లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జేసీ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్, ఎంపీపీ, జెడ్ పీటీసీ లు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Related Stories: