తుపాకులతో మూగ జీవాల వేట

ఇద్దరు వ్యక్తులు అరెస్టు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ వెంకటేశ్వరరావు హైదరాబాద్ : ఇతరులకు చెందిన లైసెన్స్ తుపాకులతో జంతువులను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను హయత్‌నగర్ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వనస్థలిపురం ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామానికి చెందిన సుర్వి రాములు అదే గ్రామానికి చెందిన దేవేందర్‌రెడ్డికి సంబంధించిన లైసెన్స్ తుపాకిని ఉపయోగిస్తున్నాడు. అలాగే అనాజ్‌పూర్‌కు చెందిన మండలి యాదగిరి కొహెడకు చెందిన నీలకంఠ భిక్షపతికి సంబంధించిన లైసెన్స్ కలిగిన తుపాకిని ఉపయోగిస్తున్నాడు. వీరిద్దరు నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌బీఎంఎల్ తుపాకులతో అనాజ్‌పూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ సీఐ వెంకటేశ్వర్లు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి శనివారం రాములు, యాదగిరిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులతో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా తుపాకి లైస్‌న్సుదారులు దేవేందర్‌రెడ్డి, భిక్షపతిలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తుపాకి లైసెన్సుదారులు తమ ఆత్మరక్షణ కోసమే వాటిని ఉపయోగించాలి తప్ప జంతువుల వేట కోసం కాదన్నారు. అలా చేస్తే చట్టపరంగా వారిపైన కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేందర్‌గౌడ్, ఎస్‌ఐ బాలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories: