కేర‌ళ‌ను కుదిపేస్తున్న అల్ప‌పీడ‌నం

ఇడుక్కి: కేరళలో నిరాటంకంగా కురుస్తున్న వర్షాలకు అల్ప పీడనమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా అరుదుగా సంభవించే అల్పపీడనమని వారంటున్నారు. కేరళలో వర్షాల వల్ల భారీగా వరదలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో సగం భాగం ఇప్పుడు జలమయం అయ్యింది. జూన్‌లో మొదలైన రుతుపవనాలు ఇంకా యాక్టివ్‌గా కొనసాగుతున్నట్లు కొచ్చిన్ వర్సిటీ డైరక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కేరళలో ఏకథాటిగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల సమయంలో ఏర్పడిన డిప్రెషన్.. సాధారణంగా 10 రోజుల వరకు ప్రభావం చూపిస్తుంది. అయితే డిప్రెషన్‌లో ఉన్న తీవ్రతను బట్టే వర్షం కొనసాగుతుందని డైరక్టర్ చెప్పారు. రుతుపవనాల సమయంలోనే ఈ సారి 30 శాతం ఎక్కువ వర్షం కురిసింది. దానికి తోడు అల్పపీడనం కూడా కదలిక లేకుండా ఉందన్నారు, సాధారణంగా దక్షిణంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తరం దిశగా పయనిస్తుంది. కానీ ఈసారి దక్షిణంలోనే కేంద్రీకృతం కావడం వల్ల కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళలో మరో వారం రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. కేరళలోని ఇడుక్కి డ్యామ్‌కు ఉన్న అయిదు గేట్లను ఎత్తేశారు. దీంతో పెరియార్ నదిలో నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. డ్యామ్ నీటి సామర్థ్యాన్ని చేరుకోవడంతో.. శుక్రవారం ఆ డ్యామ్‌లోని అయిదు గేట్లను ఎత్తేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు.. డ్యామ్‌లోని నీటి సామర్థ్యం 2401.16 అడుగులుగా ఉంది. ఈ డ్యామ్ పూర్తి సామర్థ్యం 2403 అడుగులు. ప్రస్తుతం ఇడుక్కీ డ్యామ్‌లోకి వరద నీటి ప్రవాహం తగ్గుతున్నది. కానీ గేట్ల నుంచి మాత్రం నీటిని వదులుతూనే ఉన్నారు. ఇడుక్కితో పాటు వయనాడ్ జిల్లాలు వరద నీటితో జలమయం అయ్యాయి. కేరళలో వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 29కి చేరుకున్నది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానల వల్ల ఇంకా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలను ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఇవాళ హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలంటూ విజయన్ అభ్యర్థించారు. వర్షాల వల్ల కొచ్చిలో తాగునీటి సమస్య ఏర్పడింది.

Related Stories: