అవును.. మీరు రాసేవన్నీ నకిలీ వార్తలే.. అయితే ఏంటి?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సుమారు మూడు వందలకు పైగా పత్రికలు ఒకేసారి ఏకిపారేశాయి. మీడియాపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా ఎడిటోరియల్స్ రాశాయి. తమను పదే పదే ప్రతిపక్ష పార్టీ అని నిందిస్తూ, తాము రాసేదంతా ఫేక్ న్యూస్ అని అనడంపై పత్రికలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. బోస్టర్ గ్లోబ్ అనే పత్రిక అభ్యర్థన మేరకు దేశంలోని సుమారు 350 పత్రికలు ట్రంప్ తీరును నిరసిస్తూ ఎడిటోరియల్స్ రాశాయి. మీడియాను అమెరికా ప్రజల శత్రువుగా వర్ణించడాన్ని పత్రికలు తప్పబట్టాయి. ప్రస్తుత అమెరికా ప్రభుత్వ విధానాలకు మద్దతు పలకని మీడియాను అమెరికా ప్రజల శత్రువుగా చూపించే అధ్యక్షుడు ఇప్పుడు మనకు ఉన్నారు. ట్రంప్ చెప్పిన ఎన్నో అబద్ధాల్లో ఇది కూడా ఒకటి అని బోస్టన్ గ్లోబ్ పత్రిక తన ఎడిటోరియల్‌లో స్పష్టంచేసింది.

అయితే పత్రికల ఎడిటోరియల్స్‌పై ట్రంప్ తనదైన రీతిలో స్పందించారు. తనకు అలవాటైన ట్విటర్ వేదికగానే వీటికి సమాధానమిచ్చారు. మీడియా స్వేచ్ఛ కంటే మన దేశానికి మరేదీ ఎక్కువ కాదని నేను విశ్వసిస్తాను. ఏది రాయడానికైనా మీడియాకు స్వేచ్ఛ ఉంది. కానీ వాళ్లు రాసే వార్తల్లో చాలా వరకు ఫేక్ న్యూసే. తమ రాజకీయ ఎజెండా లేదా ప్రజలను బాధపెట్టే విధంగానే వార్తలు ఉంటున్నాయి. నిజాయితీయే గెలుస్తుంది అని ట్రంప్ ట్వీట్ చేశారు.

Related Stories: