పిలవని పెళ్లికి వెళ్లి ఆశ్చర్యపరచిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన భద్రతా సిబ్బంది ఎంతో ముందుగానే వెళ్లి ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓ పిలవని పెళ్లికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. న్యూజెర్సీలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన ఈ పెళ్లికి ఏకంగా ప్రెసిడెంటే హాజరు కావడంతో అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఈ సందర్భంగా వధూవరులకు ట్రంప్ శుభాకాంక్షలు చెప్పారు. వాళ్లతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. తన మరైన్ వన్ చాపర్‌లో అక్కడికి వెళ్లారు డొనాల్డ్ ట్రంప్. ఆయన అక్కడికి వస్తున్నట్లు ఎవరికీ ఎలాంటి సమాచారం లేకపోవడం విశేషం. ట్రంప్ పెళ్లికి వచ్చిన ఫొటోలను అక్కడున్న అతిథులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయినా ట్రంప్ ఇలా పిలవని పెళ్లికి వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతేడాది జూన్‌లోనూ ఇదే గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన మరో పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

Related Stories: