డాగ్ పార్క్‌కు కెన్నెల్ క్లబ్‌ఆఫ్ ఇండియా గుర్తింపు

-అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించినందుకే గౌరవం: మంత్రి కేటీఆర్ -పార్క్ చిత్రాలను ట్విట్టర్‌లో షేర్‌చేసిన మంత్రి
శేరిలింగంపల్లి/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని గచ్చిబౌలిలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన డాగ్ పార్క్‌కు అరుదైన గౌరవం దక్కింది. పార్క్‌కు ప్రతిష్ఠాత్మకమైన కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించింది. దేశంలోనే మొదటిసారిగా శునకాల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక డాగ్ పార్క్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కొండాపూర్‌లో ఏర్పాటుచేసిన పార్క్ ఫొటోలను ఆదివారం ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 1.3 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో శునకాల పార్క్ ఏర్పాటుచేశారు. దేశంలోని మొట్టమొదటి ఈ పార్క్‌కు కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా ధ్రువీకరణ కూడా లభించింది. కొండాపూర్‌లోని హోటల్ రాడిసన్ సమీపంలో 1.3 ఎకరాల స్థలంలో రూ.1.1 కోట్లతో ఈ పార్క్ తీర్చిదిద్దారు. గతంలో ఇక్కడ చిన్న డంపింగ్ యార్డ్ ఉండేది అని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ పార్క్ త్వరలోనే ప్రారంభంకానుంది.