విజయ్ మాల్యా పెళ్లి చేసుకోబోతున్న పింకీ ఎవరో తెలుసా?

లండన్: బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లికర్ కింగ్ విజయ్ మాల్యా.. ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె పేరు పింకీ లాల్వానీ. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసింది. మాల్యా కంటే వయసులో చాలా చిన్నది. మూడేళ్లుగా అతనితో కలిసి ఉంటుంది. మాల్యా ఉండే లండన్‌కు సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ మాన్షన్‌లోనే పింకీ కూడా ఉంటున్నది. ఈ మధ్యే వీళ్లు లివింగ్ రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టి మూడేళ్లయిన సందర్భంగా లండన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయిన సమయంలోనే ఈ పింకీ కూడా వెళ్లినట్లు సమాచారం. మాల్యా తల్లితోనూ ఆమె తరచూ కనిపిస్తూ ఉంటుంది. లండన్ వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో జరుగుతున్న విచారణకు మాల్యాతో కలిసి వస్తుంది. మాల్యా 2016, మార్చి నుంచి యూకేలోనే ఉంటున్న విషయం తెలిసిందే. మాల్యా తొలిసారి 1986లో ఎయిరిండియా ఎయిర్‌హోస్టెస్ సమీరా త్యాబ్జీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు. 1993లో చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న రేఖా మాల్యాను పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు పెళ్లిళ్ల నుంచి మాల్యాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్లు సిద్దార్థ్, లియానా, తాన్యా.
× RELATED కాంగ్రెస్, టీడీపీల పొత్తు అనైతికం: మంత్రి కేటీఆర్