బుల్స్-బేర్స్ పోటాపోటీ

దలాల్‌స్ట్రీల్‌లో విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి. బుల్స్ బేర్స్ మధ్య మార్కెట్ మీద పట్టు కోసం పోరు పెరిగింది. ఒకవైపు ఫండమెంటల్స్ చూస్తే షేర్లు చవగ్గా లేవన్నది వాస్తవం. మరో వైపు దేశీయ ఆర్థిక వ్యవస్థలో ప్రోత్సాహకర అంశాలన్నీ మసకబారుతున్నాయి. పెరిగిపోతున్న రూపాయి విలువ కన్నా పెరిగిపోతున్న కరెంట్ ఖాతా లోటే కీలకం అన్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించి దాన్ని అదుపు చేయడానికి చర్యలను ప్రకటించింది. మరో వైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్ నుంచి విరమణ వేగం పెరిగింది. డాలర్లు రుణ మార్కెట్ నుంచి కూడా తరలి వెళుతున్నాయి. స్టాక్ మార్కెట్‌లో పరిస్థితి నేతి బీరకాయ చందనా మారింది. మార్కెట్ పెరుగుతున్నా పోర్టుఫోలియోలు పెరగడం లేదు. ఇలాంటి భిన్న పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు తోచక రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నారు. గత వారాలుగా మార్కెట్ యాక్షన్ ఒకే రకంగా ఉంటున్నది. వారంమొదట్లో భారీ పతనం, చివరి రెండు రోజుల్లో భారీ రికవరీ ఇదీ తంతు. ఐఐపీ, ద్రవ్యోల్బణం, ఎగుమతుల తదితర అంశాలకు తోడు రూపాయి మారకం విలువ కోలుకోవడంతో శుక్రవారం భారీ లాభాలతో ముగిసాయి. వారంతంలో ప్రధాని అధ్యక్షతన ఆర్థికవ్యవస్థ పనితీరుపై సమీక్ష సమావేశం అంచనాలతో మార్కెట్‌లో సెంటిమెంట్ పుంజుకుంది. కరెంట్ ఖాతా లోటును అదుపు చేయడానికి శుక్రవారం పొద్దుపోయాక ఆర్థిక మంత్రి ఐదు చర్యలను ప్రకటించారు. మరో వైపు ఫార్మా, ఐటీ, మెటల్ షేర్లలో ర్యాలీ కొనసాగుతునే ఉంది. వచ్చే వారం కూడా డాలర్ రెవెన్యూలు ఉండే కంపెనీలే ఫోకస్‌లో ఉండనున్నాయి.

ట్రంప్ నిర్ణయమే కీలకం:

చైనా ఉత్పత్తులన్నింటిపైనా అదనపు సుంకాలను విధించడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధపడుతున్నారని, ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకటనే వెలువడితే ట్రేడ్ వార్ భయాలు ముదిరి ప్రపంచమార్కెట్లన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దాంతో మరోదఫా కరెన్సీ మార్కెట్‌లోనూ హెచ్చుతగ్గులు భారీగా ఉంటాయి. చైనా ప్రతీకార సుంకాలను విధించడం ప్రారంభిస్తే గ్లోబల్ ట్రేడ్‌వార్ ముదిరిపోతుంది. మరోవైపు వర్ధమాన దేశాల కరెన్సీలన్నీ ఈ ఏడాది ఇప్పటికే భారీ నష్టపోయాయి. ఆసియా కరెన్సీలన్నింటిలోకి రూపాయి మారకం విలువ ఎక్కువగా నష్టపోయింది. ప్రభుత్వం ప్రకటించిన చర్యలు రూపాయి మారకం విలువను ఎంతవరకు కాపాడుతాయో చూడాలి. అలాగే రూపాయి మారకం విలువ అసాధారణ స్థాయికి పతనం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో కనీస స్థాయిల నుంచి భారీగా కోలుకున్న రూపాయి వచ్చే రికవరీ కొనసాగుతుందా లేదా గమనించాలి. అలాగే క్రూడాయిల్ ధరలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఎస్‌టీటీ, సీటీటీలను కూడా తగ్గించడమో లేదా రద్దు చేయడమో జరగాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలు నిజమైతే మార్కెట్‌కు చాలా సానకూలంగా మారే అవకాశం ఉంది.

డెరివేటివ్ డేటా: 11,500 వద్ద మాక్స్ పెయిన్

సెప్టెంబర్ సీరిస్ ముగింపునకు మరో 8 ట్రేడింగ్ సెషన్లే ఉన్నాయి. 11800 ైస్ట్రెక్‌లో అత్యధికంగా కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ స్థాయి నిఫ్టీ గట్టి నిరోధకంగా భావించవచ్చు. ఆ తర్వాత 11600 ైస్ట్రెక్‌లో కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాగా, 11400 కాల్స్ నుంచి ట్రేడర్లు బయటపడుతున్నట్టు డేటా తెలుపుతున్నది. మరో వైపు 11400 ైస్ట్రెక్ పుట్ ఆప్షన్స్‌లో అత్యధిక ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాగా, 11500 స్థాయిలో మాక్స్ పెయిన్ కనిపిస్తున్నది. దీంతో నిఫ్టీ సెప్టెంబర్ సీరిస్‌లో 11500 స్థాయికి అటుఇటుగానే ముగిసే అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి.

భిన్న సంకేతాలు

నిఫ్టీ వచ్చే వారం కూడా కన్సాలిడేట్ అవడానికే అవకాశాలున్నాయి. చివరి రెండురోజుల్లో 265 పాయింట్ల బౌన్స్ వచ్చినప్పటికీ 20 రోజుల చలన సగటును అధిగమించలేకపోయింది. డైలీ, వీక్లీ చార్ట్‌లలో పరస్పర విరుద్ధ సంకేతాలను ఇస్తున్నది. వీక్లీ చార్ట్‌లో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాట్రన్‌కు ధృవీకరణ లభిస్తే, డైలీ చార్ట్‌లో బుల్లిష్ హ్యామర్ ప్యాట్రన్‌కు ధృవీకరణ లభించింది. దీంతో ఈ వారం కదలిక కీలక కానుంది. సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉన్నా నిఫ్టీ కన్సాలిడేడ్ కాడానికే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. గత వారం 50 రోజుల చలన సగటు వద్ద మద్దతు తీసుకున్నట్టుగానే ఈ వారం 20 డీఎంఏ స్థాయి 11,545 మార్కును అధిగమించి ముగిస్తే 11600 స్థాయిలో గట్టి నిరోధం ఎదురవుతున్నది. వీక్లీ చార్ట్‌లలో నెగటివ్ డైవర్జెన్స్ కొనసాగుతున్నది. ట్రెండ్ బలాన్ని తెలిపే ఎడీఎక్స్ ఇండికేటర్ అప్‌ట్రెండ్ పటిష్టతను కోల్పోతున్నట్టు తెలియచేస్తున్నది. విభిన్న సంకేతాలున్నందున షేర్ల కొనుగోలు సెలక్టివ్‌గా ఉండాలి.

ఎఫ్‌ఐఐ అమ్మకాల జోరు

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత పక్షం రోజుల్లో మార్కెట్‌నుంచి రూ. 9,406 కోట్లను విరమించుకున్నారు. పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, క్రూడాయిల్ ధరలకు తోడు రూపాయి మారకం విలువ పడిపోతుండడంతో గత రెండునెలలుగా కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌ఐఐలు ఈ నెలలో అమ్మకాలు దిగారు. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో రూ. 61,000 కోట్లను విరమించుకున్న ఎఫ్‌ఐఐలు, ఆగస్టు నెలలో నికరంగా రూ. 2,300 కోట్ల కొనుగోళ్లు జరిపారు. తాజా డిపాజిటరీ డేటాను బట్టి సెప్టెంబర్ 3.-14 తేదీల మధ్య ఈక్విటీల నుంచి రూ. 4,318 కోట్ల పెట్టుబడులను విరమించుకున్నారు. కాగా, రుణ మార్కెట్ల నుంచి రూ. 5,088 కోట్ల పెట్టుబడులను విరమించుకున్నారు. దీంతో మొత్తం 130కోట్ల డాలర్లకు సమానమైన రూ. 9,406 కోట్ల పెట్టుబడులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి విరమించుకున్నట్టు అయింది. జీఎస్టీ వసూళ్లు తగ్గడంతో పాటు ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకునే అంశంపై సందేహాలు తలెత్తడంతో కూడా మన దేశ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అలాగే క్యాపిటల్ మార్కెట్ వాల్యూయేషన్లు కూడా గరిష్ఠ స్థాయిలో ఉన్నందున కూడా పెట్టుబడుల ఉపసంహరణకు పాల్పడుతున్నారని మార్నింగ్ స్టార్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు హిమంశు శ్రీవాస్తవ తెలిపారు. గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలు కూడా పెరుగుతుండడంతో సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి విరమించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఎఫ్‌ఐఐల అమ్మకాల మరికొంత పెరిగితే స్టాక్ మార్కెట్లో కరెక్షన్ అవకాశాలున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చి హెడ్ నవీన్ కులకర్ణి తెలిపారు.

Related Stories: