50కే లీటర్ డీజిల్, 55కు పెట్రోల్!

- జీవఇంధనం ఉత్పత్తిని పెంచితే ఇది సాధ్యమే - కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
రాయ్‌పూర్, సెప్టెంబర్ 10: కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి ఐదు ఇథనాల్ ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేసిందని, ఈ ప్లాంట్లలో వరిగడ్డి, గోధుమ గడ్డి, చెరుకు, మున్సిపల్ వ్యర్థాల ద్వారా ఇంధనం ఉత్పత్తి అవుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రూ.50కే లీటర్ డీజిల్, రూ.55కే లీటర్ పెట్రోల్‌ను అందించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని చరోడాలో నిర్వహించిన ఓ సభలో మంగళవారం ప్రసంగించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడం వల్ల పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. మనం రూ.8 లక్షల కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. వీటి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పడిపోతున్నది. ఇథనాల్, మిథనాల్, బయోఫ్యూయల్, సీఎన్జీ వినియోగాన్ని పెంచడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బయోఫ్యూయల్ హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు బయోటెక్నాలజీ పరిశోధన సంస్థను రాయ్‌పూర్‌లో నెలకొల్పుతాం అని గడ్కరీ పేర్కొన్నారు.