పదేపదే చంపొద్దు!

అదేపనిగా హింసాత్మక ఘటనల ప్రసారం ప్రమాదకరం టీవీ చానళ్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచన నిబంధనలు అతిక్రమిస్తే కేబుల్ యాక్ట్ ప్రకారం చర్యలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పరువు హత్యల పేరిట ఇటీవల జరిగిన ఘటనలను కొన్ని న్యూస్ చానళ్లు పదేపదే ప్రసారం చేయడాన్ని పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు పదేపదే ప్రసారం చేయవద్దని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి గురువారం సూచించారు. ఈ రకమైన ప్రసారం ఒకరకంగా హింసను ప్రేరేపించినట్లు అవుతుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగడానికి కారణమవుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి వీడియోలు ప్రసారం చేసినట్లయితే కేబుల్‌టీవీ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ ధిక్కారం కింద పరిగణించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సమాజ శ్రేయస్సు దృష్ట్యా అన్ని టీవీ చానళ్ల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్, 1994 (రూల్ 6) లోని వివరాలు వెల్లడించారు.