డిఫాల్ట్ కాలేదు.. డిలే అంతకన్నా లేదు: డీహెచ్‌ఎఫ్‌ఎల్

తమ రుణ పత్రాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాలేదనీ అలాగే వాటిపై వడ్డీ చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం చేయలేదని హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్ స్పష్టం చేసింది. కంపెనీలో లిక్విడిటీ సమస్యల తలెత్తిందంటూ వచ్చిన వార్తలతో శుక్రవారం నాడు కంపెనీ షేరు 42 శాతం మేర నష్టపోయింది. రూ. 575 కోట్ల విలువైన కమర్షియల్ పేపర్లకు సంబంధించిన చెల్లింపులను నిర్ణీత గడువులోగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామనీ, సోమవారం నాడే రూ. 400 కోట్లను తిరిగి చెల్లిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కేర్, ఇక్రా లాంటి రేటింగ్ ఏజెన్సీ తమకు అత్యధిక భద్రత కలిగిన కంపెనీగా రేటింగ్‌ను ఇచ్చిందని కంపెనీ సీఎండీ కపిల్ వాద్వాన్ వివరించారు. ఏటా సగటున తమ కంపెనీ ఆస్తులు 26.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయని ఆయన అన్నారు. జూన్ 30 నాటికి తమ నిర్వహణలో రూ. 1.21 లక్షల కోట్ల ఆస్థులు (ఏయుఎం) ఉందని కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వాద్వాన్ ఇచ్చిన వివరణతో కంపెనీ షేరు 15 శాతం మేర రికవరీ అయి రూ. 404.30 వద్ద ముగిసింది.