దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నాం : కడియం

హైదరాబాద్ : తెలంగాణ నలుమూలల నుంచి ప్రగతి నివేదన సభకు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డలందరికీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి నివేదన సభా వేదిక మీద కడియం శ్రీహరి ప్రసంగించారు. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. రైతును రాజును చేయాలనే సంకల్పంతో పంట రుణాలను మాఫీ చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. రైతులు వ్యవసాయం సాఫీగా చేసుకోవాలనే ఉద్దేశంతో 24 గంటల ఉచిత విద్యుత్ సీఎం కేసీఆర్ ఇస్తున్నారని చెప్పారు. దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నామంటే.. సీఎం కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని కొనియాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కంటి వెలుగు కార్యక్రమాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా మరెన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. మరోసారి తెలంగాణ ప్రజలు నిండు మనసుతో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కడియం శ్రీహరి కోరారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?