అరేబియా సముద్రంలో అల్పపీడనం

హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 2 డిగ్రీల మేర తగ్గుదల నమోదవుతోంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, గురువారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు టీఎస్‌డీపీఎస్ నివేదిక ప్రకారం..భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్-భూపాలపల్లి, కొమురంభీం-ఆసిఫాబాద్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అత్యధికంగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ 36నుంచి 37 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే..22 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 26 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్టంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ నివేదిక వెల్లడించింది.

Related Stories: