ఆధార్ లేదని గెంటేస్తే.. గేటు వద్దే ప్రసవించింది

గుర్గావ్ : ఆధార్ కార్డు లేదని గెంటేస్తే.. ఆస్పత్రి గేటు వద్దే ప్రసవించిన వైనం గుర్గావ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ.. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చింది. గర్భిణి మున్ని కేవాత్(25) తన ఆధార్ కార్డును ఇంటి వద్దే ఉంచింది. ఆమె ఆధార్ కార్డు ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేసింది. ఆధార్ నెంబర్ చెప్తామని మున్ని భర్త వేడుకున్నప్పటికీ మహిళా డాక్టర్, నర్సులు కనికరించలేదు. అప్పటికే గర్భిణికి పురిటి నొప్పులు తీవ్రమవడంతో.. ఆస్పత్రి గేటు వద్దనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ తతంగాన్ని మొత్తాన్ని అక్కడున్న కొంతమంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి.. ఆస్పత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు కారణమైన మహిళా డాక్టర్, నర్సులను ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజోరా సస్పెండ్ చేశారు. గర్భిణికి వైద్యం నిరాకరించిన డాక్టర్, నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?