ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హిందువు ఎలా అవుతుంది?

న్యూఢిల్లీ: ఓ ముస్లింను పెళ్లి చేసుకున్న కారణంగా చనిపోయిన హిందు మహిళకు గుడిలో కర్మ నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు అంగీకరించలేదు. ఢిల్లీలో బెంగాలీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హిందువు ఎలా అవుతుందని వాళ్లు ప్రశ్నించారు. నిజానికి ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె తన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. కోల్‌కతాకు చెందిన ఇంతియాజుర్ రెహమాన్, నివేదిత ఘాటక్ 20 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. నివేదిత ఈ మధ్యే అనారోగ్యంతో ఢిల్లీలో మృతి చెందింది. ఆమెకు హిందూ సాంప్రదాయం ప్రకారమే ఢిల్లీలోని నిగమ్ మోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే పది రోజుల తర్వాత నిర్వహించే శార్దకర్మలకు మాత్రం ఆలయ బోర్డు అడ్డు చెప్పింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో రెహమాన్ కమర్షియల్ ట్యాక్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్ట్ 6వ తేదీన తాను శార్దకర్మలు నిర్వహించడానికి చిత్తరంజన్ పార్క్‌లోని కాళీ మందిర్ సొసైటీలో స్లాట్ బుక్ చేసుకున్నానని, దీనికోసం రూ.1300 చెల్లించినట్లు రెహమాన్ చెప్పాడు. అయితే తన బుకింగ్ రద్దుచేసినట్లు ఆలయ సొసైటీ తనకు సందేశం పంపినట్లు అతను తెలిపాడు. రెహమాన్ తన వివరాలు గోప్యంగా ఉంచి బుకింగ్ చేసుకున్నాడని ఆలయ సొసైటీ అధ్యక్షుడు అశితవ భౌమిక్ వెల్లడించారు. తన కూతురు ఐహిని అంబ్రీన్ పేరుతో బుక్ చేసుకున్నారని, ఆమె పేరు ముస్లింగా అనిపించలేదని ఆయన చెప్పారు.

అయితే ఆలయంలోని పూజారికి అనుమానం వచ్చి రెహమాన్‌ను గోత్రం అడగటంతో అసలు విషయం బయటపడినట్లు అశితవ తెలిపారు. ఓ మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఇంటిపేరునే తన ఇంటిపేరుగా మార్చుకుంటుందని, ఆ మహిళ ఇక ఏమాత్రం హిందువు కాదని భౌమిక్ స్పష్టంచేశారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొనే రెహమాన్‌కు అనుమతి నిరాకరించినట్లు ఆయన తెలిపారు. ఆ మహిళ చివరి కోరికను తీర్చడం ధర్మం కదా అని అడిగితే.. రెహమాన్ ఉద్దేశమేంటో మనకు తెలియదు కదా.. ఆయన వెంట తన బంధువులను తీసుకొచ్చి గుడిలో నమాజ్ చేస్తే ఏం చేయాలి అని ప్రశ్నించారు. అంతగా హిందూ ధర్మం ప్రకారం నిర్వహించాలనుకుంటే ఇంట్లో చేసుకోవాలని సూచించారు.

Related Stories: