పగలు దర్జీ.. రాత్రి దారుణమైన సీరియల్ కిల్లర్!

- 33 మందిని దారుణంగా చంపి దోచుకున్నాడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని మండిదీప్‌లో ఆదేశ్ ఖామ్రా పగలు తలవంచుకుని మిషను మీద కుట్టుపని చేసుకుంటాడు. వంచిన తల ఎత్తడు. అందరి దృష్టిలో మంచివాడు. మర్యాదస్థుడు. పాపం ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో అనిపించే టైపు. కానీ రాత్రి రాక్షసునిగా మారుతాడు. ఎందుకంటే అతడో సీరియల్ కిల్లర్. ఇప్పటిదాకా 33 మందిని దారుణంగా చంపి దోచుకున్నాడు. అయితే అందరి జోలికి పోడు. అమాయకులైన లారీ డ్రైవర్లను, వారివెంట ఉండే క్లీనర్లను హతమార్చి ఉన్నది ఊడ్చేసుకుంటాడు. తర్వాత మృతదేహాలను కాలువల్లోనో, కొండల మీదనో పారేస్తాడు. శవాల మీద దుస్తులు కూడా ఉండనివ్వడు. ముఖాలను గుర్తు పట్టకుండా నలగ్గొడతాడు. దాంతో మృతుల గుర్తింపు కష్టమవుతుంది. గతవారం అనుకోకుండా ఓ మహిళా పోలీసు అడవిలో మూడురోజులు వెంటాడి పట్టుకున్నారు. మామూలు నేరస్థుడనుకుని పట్టుకున్న పోలీసులు అతడో సీరియల్ కిల్లర్ అని తెలుసుకుని విస్తుపోతున్నారు. ఓ 33 దాకా లెక్కతేలింది. ముందు 30స హత్యల గురించి ఒప్పుకున్న ఆదేశ్ మంగళవారం మరో మూడు హత్యలు చేసినట్టు ఒప్పుకోవడంతో పోలీసులు నోరువెళ్లబెట్టారు. ఇవన్నీ ఆదేశ్ ఒక్కడే చేయలేదు. అతనికి కొందరు సహచరులు కూడా ఉన్నారు. వారిలో ఇద్దరు దొరికారు. వీరు చేసే హత్యల్లో సాధారణమైన అంశం ఏమంటే లారీ డ్రైవర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం. వారితో స్నేహం నటించి మందు తాగబోసి ఆ తర్వాత చంపేస్తారు. వారివద్దనున్న డబ్బూదస్కం లాగేసుకుని శవాలను పారేస్తారు. 2010లో ఆదేశ్ ఈ హత్యలు మొదలుపెట్టాడు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, బీహార్‌లలో శవాలు దొరికాయి. ఇవేవో మతిలేని స్థితిలో చేసిన హత్యలు కావు. ఆ నరరూప రాక్షసుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా డ్రైవర్లకు తాను ముక్తిని ప్రసాదించానని పకపక నవ్వుతూ చెప్పడం గమనార్హం. ఎవరెవరిని ఎలా చంపాడో పూసగుచ్చినట్టు చెప్తున్నాడట. కేసుల వివరాలు పరిశీలిస్తే అతడు చెప్పే విషయాలు కచ్చితంగా సరిపోతున్నాయి. ఎక్కడెక్కడో ఎటూతేలకుండా అడుగున పడిపోయిన కేసులన్నీ ఇప్పుడు పోలీసులు దుమ్ము దులుపుతున్నారు. బట్టలు కుట్టుకునే దర్జీ ఇంతటి దుర్మార్గాలకు ఒడిగట్టాడా? అని స్థానికులు విస్తుపోతున్నారు.

Related Stories: