జానీ వార్నర్ ధనాధన్..స‌న్‌రైజ‌ర్స్‌ 15 ఓవ‌ర్ల‌లోనే..

హైదరాబాద్‌:ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు పరుగుల సునామీ సృష్టించారు. స్టాండ్స్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న అభిమానులపై బౌండరీల వర్షం కురిపించారు. బంతిని ఎడాపెడా బాదుతూ మైదానం నలువైపులా పరుగుల రాబట్టారు. బౌలర్‌ ఎవరైనా.. బంతి ఎలా పడినా.. టార్గెట్‌ బౌండరీ లైన్‌ దాటడమే లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ కేవలం 15 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(80 నాటౌట్‌: 43 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌(67: 38 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విజృంభించారు. దీంతో హైద‌రాబాద్ ఐదు ఓవ‌ర్లు మిగిలుండ‌గానే 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. సన్‌రైజర్స్‌కు మంచి శుభారంభం అందించిన జోడీ తొలి వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్లను పెవిలియన్‌ పంపడంలో కోల్‌కతా బౌలర్లు విఫలమయ్యారు. అందరూ ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. వార్న‌ర్ ఔటైనా విలియ‌మ్స‌న్(8 నాటౌట్‌) సాయంతో బెయిర్‌స్టో ఛేద‌న‌ను ముగించాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ ఓపెనర్‌ క్రిస్‌లిన్‌(51: 47 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) అర్థశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది. మిడిలార్డర్‌లో రింకూ సింగ్‌(30).. ఆరంభంలో సునీల్‌ నరైన్‌(25: 8 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. క్రిస్‌లిన్‌ ఆఖరి వరకు పోరాడినప్పటికీ అతని సహకరించే వారు కరువయ్యారు. కెప్లెన్ దినేశ్ కార్తీక్‌(6) నిరాశ‌ప‌రిచాడు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ స్కోరు వేగం పెరగలేదు. యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌(3/33) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డెత్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ అద్భుతంగా బంతులేసింది. ముఖ్యంగా ఖలీల్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌(1/23) బౌలింగే మ్యాచ్‌లో హైలెట్‌. సీజన్‌ ఆరంభం నుంచి అన్ని జట్లపై విరుచుకుపడుతున్న ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌(15: 9 బంతుల్లో 2సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడలేకపోయాడు. భువీ(2/35) వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది ఊపుమీదున్న రస్సెల్‌ను అదే ఓవర్‌లో పెవిలియన్‌ పంపాడు. కీలకమైన 18వ ఓవర్‌లో రషీద్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది.
More in క్రీడలు :