కలెక్టరేట్లలో డ్యాష్ బోర్డులు

-కలెక్టర్ల కండ్లెదుటే సంక్షేమ పథకాల వివరాలు -20 ప్రధాన శాఖలకు చెందిన 90 అంశాలు -పైలట్‌గా నాలుగు జిల్లాల్లో ప్రారంభం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కలెక్టరేట్లలో డ్యాష్ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సంక్షేమ పథకాలు సక్రమంగా నిర్వహించేందుకు కలెక్టర్లకు డ్యాష్ బోర్డులు ఏర్పాటుచేయనున్నారు. ఇకపై ప్రభుత్వ పథకాల వివరాలతోపాటు అమలవుతున్న సమాచారం కూడా కలెక్టర్ల చేతి మునివేళ్ల కిందికి రానున్నది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో కలిసి రాష్ట్ర ప్రణాళికా విభాగం.. తెలంగాణ రాష్ట్ర జిల్లా పర్యవేక్షణ వ్యవస్థ (టీఎస్ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సిస్టం-టీఎస్‌డీఎంఎస్)కు రూపకల్పన చేసింది. పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, మంచిర్యాల కలెక్టరేట్లలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ పథకాల అమలు తీరుతెన్నుల సమగ్ర సమాచారం ఇక కలెక్టర్ల ఫింగర్‌టిప్స్‌పై నిక్షిప్తం కానున్నది.

వివిధ పథకాలు క్షేత్రస్థాయిలో ఏవిధంగా అమలవుతున్నాయో తెల్సుకోవడంతోపాటు రోజువారిగా పథకాల తీరుతెన్నులను పరిశీలించి లోటుపాట్లను సరిదిద్దేందుకు కిందిస్థాయి అధికారులను ఆదేశించే అవకాశం కలెక్టర్లకు ఏర్పడనున్నది. తక్కువ సమయంలో సమస్యల్ని పరిష్కరించేందుకు, వివరాల్ని నమోదు చేసేందుకు డ్యాష్ బోర్డులతో సాధ్యంకానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రధాన 20 శాఖల్లోని 90 అంశాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నాలుగు జిల్లాల్లో డ్యాష్ బోర్డు పనితీరును మదింపువేయనున్నారు. వచ్చే ఫలితాల ఆధారంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

20 ప్రధాన శాఖలు.. 90 అంశాలు డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సిస్టం (డీఎంఎస్) అప్లికేషన్లు అన్ని కలెక్టరేట్లలో అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డులను ఉపయోగించడంపై అధికారులకు శిక్ష ణ కూడా ఇచ్చారు. ఒక్కో సంక్షే మ పథకం అమలు విధానం రోజువారీగా ఎలా ఉన్నదనే విష యం ఈ విధానం ద్వారా అధికారులు తెలుసుకోగలుగుతా రు. పథకాల అమలులో మార్పులు, చేర్పులను వెంటనే పూర్తిచేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికి 20 ప్రధాన శాఖలకు చెందిన 90 అంశాలను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు ఐటీ అధికారులు గుర్తించారు.