మల్టీ మిలియన్ డాలర్ కంపెనీకి అధిపతి అయిన దళిత చిన్నారి పెళ్లికూతురు..!

-ఇది ఓ మహిళ విజయ గాథ. ఆమె మాటల్లోనే చదవండి.. మాది మహారాష్ట్రలోని అకోలాకు సమీపంలో ఉన్న ఓ కూగ్రామం. దళిత కుటుంబంలో పుట్టా నేను. నాకు 12 ఏండ్లు ఉన్నప్పుడు నాకు పెండ్లి చేయాలంటూ నా తండ్రిని మా ఊరు వాళ్లు బలవంతం చేశారు. దీంతో చేసేదేమి లేక నా తండ్రి నాకన్నా 10 ఏండ్లు పెద్ద వాడైన ఓ వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశారు. నా భర్త, అతడి ఫ్యామిలీ ఉండేది ముంబైలో. అక్కడికి వెళ్లాక కానీ తెలియలేదు వాళ్లు ఉండేది స్లమ్ ప్రాంతంలో అని. అది కూడా జోపడపట్టీలో(జోపడపట్టీ అంటే రేకుల రూం. చాలా చిన్నగా ఉంటుంది. ముంబైలోని స్లమ్ ఏరియాల్లో ఈ తరహా ఇండ్లే ఎక్కువగా కనిపిస్తాయి). అతడికి అప్పుడు ఉద్యోగం కూడా లేదు. ఇక.. నన్ను వాళ్లు ఓ పనిమనిషిలా చూశారు. నాతో అన్ని పనులు చేయించుకునేవారు. కూరలో కాస్త ఉప్పు ఎక్కువైనా చాలు నన్ను తీవ్రంగా కొట్టేవారు. చిత్రహింసలు పెట్టేవారు. నా పెళ్లయిన ఆరు నెలల తర్వాత నా తండ్రి నన్ను చూడటానికి వచ్చాడు. నన్ను చూసి షాకయ్యాడు. ఎందుకంటే మాసిపోయిన డ్రెస్సుతో ముఖం మాడ్చుకొని ఉన్న నన్ను చూసి తట్టుకోలేక నా భర్త ఫ్యామిలీతో గొడవ పెట్టుకొని నన్ను అకోలాకు తీసుకెళ్లిపోయాడు. అదంతా ఓ పీడకల అనుకొని మరిచిపోవాలని చెప్పాడు. కానీ.. మా ఊరు వాళ్లు నేనే ఏదో తప్పు చేసినట్టు నాపై వేలెత్తి చూపడం మొదలు పెట్టారు. దీంతో నేను తట్టుకోలేక పోయాను. అక్కడ ఉండలేక మళ్లీ ముంబై వచ్చేశాను. తెలిసిన వాళ్ల దగ్గర టైలర్‌గా పనిచేయడం మొదలు పెట్టాను. మొదటిసారి టైలర్ పని ద్వారా వచ్చిన 100 రూపాయలను చూశా. చాలా మురిసిపోయా. కల్యాణ్‌లో రూం రెంట్‌కు తీసుకున్నా. కొన్ని రోజుల తర్వాత నా ఫ్యామిలీని కూడా ముంబై రప్పించా. కానీ.. ఆ టైలర్ పనితో వచ్చే డబ్బులు నా ఫ్యామిలీని పోషించడానికి ఎటూ సరిపోలేదు. దీంతో ఆర్థికంగా చాలా బాధపడ్డాం. ఇలా అయితే లాభం లేదనుకొని.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని లోన్ తీసుకున్నా. ఫర్నీచర్ బిజినెస్ ప్రారంభించా. దీంతో మా కష్టాలు కాస్త గట్టెక్కాయి. నాలుగు రాళ్లు సంపాదించడం ప్రారంభించా. అయినా.. ఏదో అసంతృప్తి. అప్పుడే ఓ ఐడియా వచ్చింది. నాలా ముంబై వచ్చి.. ఏం చేయలేక ఇబ్బందులు పడేవాళ్లు కోకొల్లలు. వాళ్లకు నాకు చేతనైనంత సాయం చేయాలనుకున్నా. దీంతో ఓ ఎన్జీవోను ప్రారంభించా. వాళ్లకు ప్రభుత్వం నుంచి లోన్స్ వచ్చేలా చేశా. దీంతో కొంతమంది తమ కాళ్ల మీద నిలబడటం ప్రారంభించారు. కొన్ని సార్లు నా పాకెట్ నుంచి డబ్బులు ఇచ్చేదాన్ని. అలా నా జీవితం సాగుతుండగా.. నా జీవితాన్ని టర్న్ చేసిన ఆ రోజు రానే వచ్చింది. కమానీ ట్యూబ్స్ అనే కంపెనీకి చెందిన వర్కర్స్ వాళ్ల కంపెనీని కాపాడాలని నన్ను కోరారు. ఆ కంపెనీ 140 లిటిగేషన్ కేసుల్లో ఇరుక్కుంది. 116 కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయింది. 500 ఫ్యామిలీలు ఆ కంపెనీ మీద ఆధారపడ్డారని.. ఎలాగైనా ఆ కంపెనీని గట్టెక్కించాలని వారు కోరారు. దీంతో వారికి సాయం చేయాలనుకున్నాను. వాళ్లకు న్యాయం జరగాలనుకున్నాను. అందుకే నాకు తెలిసిన వారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్‌తో అపాయింట్‌మెంట్ తీసుకొని ఆయనతో కంపెనీ పరిస్థితి వివరించా. ఆయన కంపెనీ అప్పును తగ్గించాడు. బ్యాంకులతో మాట్లాడాడు. దీంతో నేను ఓ టీమ్‌ను ఏర్పాటు చేసి ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశా. 2006లో ఆ కంపెనీకి చైర్మన్ అయ్యా. 7 సంవత్సరాల్లో బాకీనంతా తీర్చాలని బ్యాంకులు తెలపగా.. మేము ఒక సంవత్సరంలోనే బ్యాంక్ లోన్లన్నీ తీర్చేశాం. వర్కర్స్‌కు జీతాలు కూడా ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఆ కంపెనీ మిలియన్ డాలర్ల వాల్యూ ఉన్న కంపెనీగా ఎదిగింది. 2013లో కేంద్ర ప్రభుత్వం నన్ను పద్మశ్రీతో సత్కరించింది. దేనికీ భయపడకుండా ముందుకు దూసుకెళ్లడమే నన్ను ఈస్థాయికి తీసుకెళ్లింది. నన్ను నేను నమ్మాను. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇది నా స్టోరీ. ఇంతకీ నా పేరు కల్పనా సరోజ్.

Related Stories: