ఒడిశాపైకి దాయె

-తీరాన్ని తాకిన తుఫాను -మల్కన్‌గిరి జిల్లాలో కుండపోత వర్షాలు - రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో తెగిపోయిన సంబంధాలు - 1163.8 మి.మి. వర్షపాతం నమోదు
భువనేశ్వర్, సెప్టెంబర్ 21: ఒడిశాలోని గోపాల్‌పూర్ ప్రాంతంలో తీరాన్ని తాకిన దాయె తుఫాను విధ్వంసం సృష్టించింది. తుఫాను ప్రభావంతో శుక్రవారం కురిసిన అతి భారీ వర్షాలు మల్కన్‌గిరి జిల్లాను ముంచెత్తాయి. దీంతో ఈ ప్రాంతానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. పోతేరు సహా పలు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ బీపీ సేథి మీడియాకు తెలిపారు. మల్కన్‌గిరి జిల్లాపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నదని, ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 మంది వరద బాధితులను రక్షించామని వివరించారు. రోడ్ల మీద వర్షపునీరు పెద్దఎత్తున ప్రవహిస్తున్నదని, గురువారం నుంచి 1163.8 మి.మి. వర్షపాతం కురువడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని మల్కన్‌గిరి కలెక్టర్ మనీశ్ అగర్వాల్ చెప్పారు.

తుఫాను బాధితులకు అన్నిరకాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారని సీఎం కార్యాలయం వెల్లడించింది. జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఒక్కరోజుకు రూ.60 చొప్పున ఏడురోజులపాటు నగదుసాయాన్ని అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 12 ఏండ్ల లోపు చిన్నారులకు రూ.45 చొప్పున అందజేస్తారు. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దాయె తుఫాను ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గోపాల్‌పూర్ వద్ద శుక్రవారం వేకువజామున తీరాన్ని దాటిందని భువనేశ్వర్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ హెచ్‌ఆర్ బిశ్వాస్ వెల్లడించారు. గంటకు 26 కి.మీ. వేగంతో పశ్చిమ-వాయవ్యం దిక్కుగా కదిలిన తుఫాను దక్షిణ మధ్య ఒడిశా ప్రాంతంలో బలహీనపడిందని తెలిపారు. మల్కన్‌గిరి, గజపతి, గంజాం, పూరిలలో భారీ వర్షాలు పడ్డట్లు చెప్పారు.

Related Stories: