45కు చేరిన ‘గజ’ మృతులు

-సహాయ చర్యల్లో భాగస్వాములు కండి -అన్నిపక్షాలకు తమిళనాడు సీఎం పళనిస్వామి పిలుపు
సేలం(తమిళనాడు), నవంబర్ 18: తమిళనాడులో తీవ్ర విధ్వంసం సృష్టించిన పెను తుఫాన్ గజ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 45కు చేరింది. తుఫాన్ విధ్వంసం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు సేలంలో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని, నాగపట్నం, తంజావూరు, తిరువూరు, పుదుకోైట్టె జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పెను గాలులకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల వివరాలు సేకరిస్తున్నామని, గ్రామాల్లో చాలా చెట్లు, పంటలు దెబ్బతిన్నాయని, పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 45 మంది తుఫాన్ కారణంగా మృత్యువాతపడ్డారని తెలిపారు. చనిపోయిన వారికి సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు నష్టపరిహారాన్ని అందజేస్తామని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు.

తుఫాన్ కారణంగా 1.7 లక్షల చెట్లు కూలిపోగా, 1.17 లక్షల ఇండ్లు దెబ్బతిన్నాయని, 735 పశువులు చనిపోయాయని, తీరప్రాంత జిల్లాలోని 88,102 హెక్టార్ల పంట దెబ్బతిన్నదని చెప్పారు. 483 సహాయ శిబిరాల్లో 2.50 లక్షల మంది ప్రజలు తలదాచుకుంటున్నారని, అంటువ్యాధులు ప్రబలకుండా 1,014 మొబైల్ మెడికల్ వాహనాలు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. వైద్యశిబిరాల ద్వారా ఇప్పటివరకు లక్ష మందికిపైగా సేవలు అందించామన్నారు. దాదాపు 40 వేల విద్యుత్ స్తంభాలు, 347 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, 12,500 మంది సిబ్బంది ద్వారా వాటిని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తుఫాన్ బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తమిళనాడును సందర్శించే అవకాశముందా అనే ప్రశ్నకు స్పందిస్తూ జరిగిన నష్టం గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చామని తెలిపారు.

Related Stories: