పార్థీవ్ మెరుపులు.. చెన్నై టార్గెట్ 162

బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్(53: 37 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) విజృంభించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సొంతగడ్డ చిన్నస్వామి మైదానంలో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. చెన్నై బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేసినప్పటికీ అందరు ఆటగాళ్లు తమదైన శైలిలో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. చెన్నై అద్భుత బౌలింగ్‌తో పాటు డుప్లెసిస్ కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో బెంగళూరు కీలక వికెట్లు చేజార్చుకుంది. బౌండరీ లైన్ వద్ద డుప్లెసిస్ అనూహ్య క్యాచ్‌లు పట్టి ఆర్‌సీబీని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(9) ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్(25) దూకుడుగా ఆడే క్రమంలో వెనుదిరిగాడు. అయినప్పటికీ మరో ఎండ్‌లో ఉన్న పార్థీవ్ వేగంగా ఆడి స్కోరు వేగం తగ్గకుండా జట్టును ముందుండి నడిపించాడు. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లో అక్షదీప్ నాథ్(24), మార్కస్ స్టాయినీస్(14), మొయిన్ అలీ(26) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. చెన్నై బౌలర్లలో జడేజా(2/29), డ్వేన్ బ్రావో(2/34), దీపక్ చాహర్(2/25) మంచి ప్రదర్శన చేశారు. ఇమ్రాన్ తాహిర్ ఒక వికెట్ పడగొట్టాడు.
More in క్రీడలు :