డిసెంబర్‌కల్లా 100 డాలర్లపైకి..

బ్యారెల్ ముడి చమురుపై ఆయిల్ ట్రేడర్ల అంచనాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఈ ఏడాది చివరికల్లా బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 100 డాలర్లను దాటిపోతుందన్న అంచనాల్ని ఆయిల్ ట్రేడర్లు వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారతీయ రిఫైనర్లు తమ దిగుమతుల్ని తగ్గించుకుని, ఇప్పటికే ఉన్న నిల్వలపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ సూచీ 2 శాతం వరకు పుంజుకున్నది. బ్యారెల్ ధర 80 డాలర్లకుపైగా పలికింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మొదలైతే ఈ ధరలు మరింత ఎగబాకవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యారెల్ ధర 100 డాలర్లను మించిపోగలదని కమాడిటీ మర్చెంట్స్ ట్రఫిగుర, మెర్కూరియా అంటున్నాయి. ఆగని పెట్రో మంట పెట్రోల్ ధరల మంట ఇప్పట్లో ఆరేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు మంగళవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 14 పైసలు ఎగబాకి రూ.83కి చేరువై రూ.82.86 వద్ద స్థిరపడింది. డీజిల్ మరో పది పైసలు బలపడి రూ.74.12కి చేరుకున్నది. హైదరాబాద్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ 14 పైసలు ఎగబాకి రూ.87.84 పలికింది. అలాగే డీజిల్ ధర మరో 11 పైసలు బలపడి రూ.80.62గా నమోదైంది. మహారాష్ట్రల్లో పెట్రోల్ ధర రూ.90ని దాటి రూ.91.99కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం చెందడంతో ఆగస్టు నెల నుంచి ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.

Related Stories: