క్రికెట్ అభిమానులు వంద కోట్ల మంది

దుబాయ్: ఇండియాలో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. అయితే మిగతా స్పోర్ట్స్‌తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు అంతగా ఆదరణ లేదు అన్న వాదన ఉంది. కానీ తాజాగా ఐసీసీ రిలీజ్ సర్వే ఫలితాలు మాత్రం దీనికి భిన్నమైన ఫలితాలను చూపించాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వంద కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారని ఈ సర్వే తేల్చింది. నీల్సన్ స్పోర్ట్స్ ఈ సర్వే నిర్వహించింది. మరో విశేషం ఏమిటంటే.. వీళ్లలో 39 శాతం మహిళాభిమానులే ఉండటం. అంటే దాదాపు మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా క్రికెట్‌ను ఇష్టపడుతున్నారు. ఐసీసీ తన అధికారిక వెబ్‌సైట్, ట్విటర్‌లో ఈ సర్వే ఫలితాలను ఐసీసీ పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 16 నుంచి 69 ఏళ్ల మధ్య క్రికెట్ అభిమానులను సర్వే చేశారు. క్రికెట్ అభిమానుల సగటు వయసును 34గా తేల్చారు. అంతేకాదు క్రమంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్నదని ఈ సర్వే స్పష్టంచేసింది. సర్వేలో పాల్గొన్నవాళ్లలో 70 శాతం మంది మహిళల క్రికెట్‌కు మరింత లైవ్ కవరేజీ ఇవ్వాలని కోరారు. ఇక అభిమానుల్లో మూడింట రెండో వంతు మంది మూడు ఫార్మాట్లను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. ఐసీసీ వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లకు విపరీతమైన ఆదరణ ఉండటం విశేషం. 95 శాతం మంది ఈ టోర్నీలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక కేవలం ఇంగ్లండ్ విషయానికి వస్తే అక్కడ టెస్ట్ క్రికెట్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. ఆ దేశంలో 70 శాతం మంది అభిమానులు టెస్ట్ క్రికెట్‌నే ఇష్టపడుతున్నట్లు సర్వేలో తేలింది. సౌతాఫ్రికాలో వన్డేలకు, పాకిస్థాన్‌లో టీ20లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్లు తెలిసింది. ఇక మూడు ఫార్మాట్లలో టీ20లకే ఎక్కువ ఆదరణ ఉంది. 87 శాతం మంది ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాల‌ని కోరుకుంటున్నార‌నీ ఈ స‌ర్వే స్ప‌ష్టంచేసింది.

Related Stories: