మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరిన మృతదేహం

నిజామాబాద్: జిల్లాలోని నందిపేట్ మండలంలోని లక్కంపల్లి గ్రామానికి చెందిన దేవిదాస్ ((35) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో మృతి చెందాడు. ఆయన మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబీకులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. దేవిదాస్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనిచేస్తుండగా మూడు నెలల క్రితం తాను ఉండే గదిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి తీవ్రగాయాల పాలై మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గదిలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించగా, సిలిండర్‌కు అంటుకొని అది పేలడంతో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ ప్రమాదంలో మృతిచెందాడని, ఆయనతో పాటు తెలంగాణకు చెందిన మరో వ్యక్తి ఈ ప్రమాదంలో మృతిచెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడు దేవిదాస్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.