సీపీఎంతో పొత్తుకు జనసేన ప్రయత్నాలు

-రేపు లేదా ఎల్లుండి రెండోదఫా చర్చలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగారా మోగడంతో పొత్తుల కోసం వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్-టీడీపీ అనైతిక పొత్తుకు సిద్ధపడగా.. మరోవైపు సీపీఎంతో జతకట్టేందుకు సినీనటుడు పవన్‌కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ పావులు కదుపుతున్నది. దీనికి పవన్‌కల్యాణ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జనసేన ఇప్పటికే సీపీఎంతో ఒకసారి చర్చలు జరిపింది. ఈ పొత్తుకు సంబంధించి పవన్‌కల్యాణ్.. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జనసేన నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సీపీఎం నేతలను మరోసారి చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. దీంతో జనసేన-సీపీఎం మధ్య మంగళవారం లేదా బుధవారం రెండోదఫా చర్చలు జరుగనున్నట్టు తెలుస్తున్నది.