చైనా ఖైదీలతో ఆ పనులు చేయిస్తున్నారు!

ఇస్లామాబాద్‌ః చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌పై సంచలన విషయాలు వెల్లడించారు పాక్‌కు చెందిన ఓ ఎంపీ. ఈ పనులను చైనా తమ ఖైదీలతో చేయిస్తున్నదని ఆరోపించారు. సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే ప్రధాన ప్రతిపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఎంపీ నవాబ్ మొహమ్మద్ యూసుఫ్ ఈ ఆరోపణలు చేశారు. పాక్ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో నవాబ్ మాట్లాడుతూ.. చైనా జైళ్ల నుంచి ఖైదీలను తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు వేయిస్తున్నారు. వాళ్లు నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది కాబట్టి సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అసలు ఓ దేశం అనుమతి లేకుండా మరో దేశం తమ ఖైదీలను ఎలా పంపిస్తుంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఏదో రహస్య ఒప్పందం కుదిరింది. చైనా కంపెనీలు ఖైదీలను కూలీలుగా వాడుతున్నాయి అని ఆయన సంచనల ఆరోపణలు చేశారు. కరాచీలాంటి ప్రాంతాల్లో ఏటీఎం మోసం కేసులలో చైనా జాతీయుల అరెస్ట్‌ను ఈ సందర్భంగా నవాబ్ ప్రస్తావించారు. ఇలాంటి నేరాలకు పాకిస్థానీలు పాల్పడరు. అందుకే ఏటీఎంలో డబ్బు చోరీ, ఇతర కంప్యూటరైజ్డ్ నేరాలు చైనా ఖైదీల పనే అని ఆయన స్పష్టంచేశారు. చైనా ఖైదీలు ఉన్న విషయాన్ని పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు ఆ దేశానికి చెందిన ఓ పత్రిక కూడా వెల్లడించింది. పాక్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో చైనా ఖైదీలు ఉన్నట్లు నవాబ్.. ఈ పత్రికకు చెప్పారు. సదరు మంత్రిత్వ శాఖ పట్టించుకోకపోవడం నా అనుమానాలను మరింత పెంచింది. ఓ అధికారి కూడా ఖైదీలు పనిచేస్తున్నట్లు నాతో చెప్పారు అని ఆయన అన్నారు.
× RELATED ఈవీఎంలే బెటర్ : బీహార్ సీఎం