గణేష్ చందాలపై బలవంతం పెడితే ఊరుకోం : సీపీ

హైదరాబాద్ : రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. వచ్చే నెల ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు గణేష్ నవరాత్రుల నేపథ్యంలో అసాంఘిక శక్తులు బలవంతపు వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చందాల పేరుతో శాంతికి భంగం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 10వ తేదీ నుంచి దరఖాస్తులు గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆయా పోలీస్‌స్టేషన్లలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని, గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన రూట్‌ను తప్పనిసరిగా దరఖాస్తు ఫారాలలో పొందుపరచాలన్నారు. దరఖాస్తులను ఆగస్టు 21వ తేదీలోగా పోలీస్‌స్టేషన్లలో అందజేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా రోడ్లపై క్రాకర్స్ కాల్చడంపై నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.

Related Stories: